జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం : ఇకపై రోజువారీ విచారణ
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై ఉన్న సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పదేళ్లుగా పెండింగ్లో ఉన్న కేసుల విచారణ వేగవంతంకానుంది.
ఈ కేసుల్లో జగన్తో పాటు మరో 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. జగన్పై దాదాపు దశాబ్దకాలంగా 9 ఈడీ చార్జిషీట్లు న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నాయి. వీటిపై విచారణనను వేగవంతం చేయాలని కోరుతూ ఈడీ అధికారులు ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
సీబీఐ కోర్టులో నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పులు రాకపోవడంతో కేసు విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. ఈడీతో పాటు మాజీ మంత్రి హరిరామజోగయ్య, మరికొందరు కూడా విచారణనను వేగవంతం చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తీసుకున్న తాజా నిర్ణయంతో జగన్పై ఉన్న కేసు విచారయణ ఇకపై వేగంగా ముందుకుసాగే అవకాశం ఉంది.

