విజయ్‌కాంత్ పక్కా ప్లాన్: చివరికి డీఎంకేతోనే పొత్తు.. డిప్యూటీ సీఎం పదవి కోసమేనా?!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2016 మేలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పక్షాలు వ్యూహరచనల్లో మునిగి తేలుతున్నాయి. పొత్తులపై పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత, డీఎండీకే అధినేత విజయకాంత్‌తో పొత్తు పెట్టుకునేందుకు అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి. మరి ఎవరితో విజయకాంత్ జత కడతారో అనేది ఇంకా సస్పెన్స్ వీడలేదు.
అధికార అన్నాడీఎంకే పార్టీ అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న విపక్ష నేతలు.. డీఎండీకే అధినేత విజయకాంత్ వేసిన ఎత్తుకు చిత్తయిపోయారు. తనకు ఎనలేని డిమాండ్ వున్నట్లు రాజకీయవర్గాల్లో, ప్రజల్లో భ్రమలు కల్పించేందుకు విజయకాంత్ పన్నిన వలలో డీఎంకే నేతలే కాదు.. ఇతర పార్టీ నేతలు సైతం చిక్కుకుపోయారు. వచ్చే మే మాసంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, డీపీఐలతో కూడిన ప్రజా సంక్షేమ కూటమి, బీజేపీ, డీఎంకే తదితర పార్టీలు తమతో కలిసొచ్చే వారి కోసం ముమ్మరంగా అన్వేషిస్తున్నాయి.
గతవారం బీజేపీ నేతలైన పొన రాధాకృష్ణన్, తమిళిసై సౌందరరాజన్, మోహన్‌రాజులు విజయకాంత్‌తో భేటీ అయ్యారు. ఆయనతో చర్చించిన అనంతరం విజయకాంత్‌తో తమతో పొత్తు పెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదేవిధంగా ఇటీవల ప్రజాసంక్షేమ కూటమి నేతలైన వైగో, తిరుమావళవన్, ముత్తరసన్, జి.రామకృష్ణన్ తదితరులు కూడా హడావుడిగా విజయకాంత్‌తో భేటీ అయ్యారు.
వారు కూడా విజయకాంత్ తమతో చేతులు కలపడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. వారు కలిసిన మూడు గంటల్లోపే డీఎంకే అధినేత కరుణానిధి సైతం విజయకాంత్ తమతో కలిసొస్తే బావుంటుందంటూ బహిరంగ ఆహ్వానం పలికారు. అయితే అంతా అయ్యాక.. ఒక్కసారిగా మూడు కూటముల వారు ఇంత హడావుడిగా విజయకాంత్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందనే దానిపై ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
విజయకాంతే స్వయంగా ఆయా నేతలకు విడివిడిగా ఫోన్ చేసి ‘ముఖ్యమైన అంశం మాట్లాడుదాం రండి’ అంటూ పిలుపునిచ్చినట్లు సమాచారం. దీంతో ఆయా నేతలు హడావుడిగా ఆయన్ని కలుసుకున్నారు. ఈ హడావుడి చూసి డీఎంకే అధినేత కరుణానిధి సైతం తమ వద్దకు రావాలంటూ విజయకాంత్‌ను ఆహ్వానించారు. విజయ్ కాంత్ పిలుపు మేరకే బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీ నేతలంతా విజయ్ కాంత్‌ను కలిసినట్లు తేలిపోయింది. దీంతో విజయ్ కాంతే కావాలని తమిళ పార్టీలన్నింటిని పిలిపించి హంగామా చేసినట్లు సమాచారం.
అయితే డీఎండీకేను దరి చేర్చుకునేందుకు వరుసగా పార్టీలు పరుగులు తీయడంతో డీఎంకే అధినేత కరుణానిధి సైతం కొంత మెత్తబడినట్లు తెలిసింది. తమతో చేతులు కలిపితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతామని డీఎంకే ‘ఆఫర్’ చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిగురించి డీఎంకే కీలక నేతలు విజయకాంత్‌తో మాట్లాడారని, చిన్నా చితకా పార్టీలతో చేతులు కలపడం కంటే తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని వారు హామీనిచ్చారని తెలుస్తోంది. దీంతో విజయ్ కాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ, బీజేపీ పార్టీలను పక్కనబెట్టి డీఎంకేతో చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
