గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (09:43 IST)

భారత్‌లో ఒమిక్రాన్ విజృంభణ : ఒక్క రోజే 135 ఒమిక్రాన్ కేసులు

భారత్‌లో ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తుంది. దీనికి నిదర్శనమే ఒక్క రోజే ఏకంగా 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ ఇప్పటివరకు 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం మన దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 600 దాటిపోయింది. 
 
గడిచిన 24 గంటల్లో రాజధాని ఢిల్లీలో ఏకంగా 63 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 142కు చేరింది. అలాగే, తెలంగాణాలో కూడా ఒక్క రోజే 12 కేసులు వెలుగు చూడటంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 56కు చేరింది. 
 
మరోవైపు, మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 167కు చేరింది. దీంతో ఈ వైరస్ కట్టడికోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. కొత్త సంవత్సర వేడుకలు, పండగలకు కోవిడ్ ఆంక్షలను సడలించవద్దని కోరింది. అలాగే, ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చి వారికి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్‌ను వేగవంతం చేయాలని కోరింది. 
 
గోవాలో తొలి పాజిటివ్ కేసు 
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ క్రమంగా అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. ఇందులోభాగంగా, భారత్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం మన దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గోవాలో ఎనిమిదేళ్ళ బాలుడికి ఈ వైరస్ సోకింది. ఈ నెల 17వ తేదీ నుంచి బ్రిటన్ నుంచి వచ్చిన ఈ బాలుడుకి ఎయిర్‌పోర్టులో నిర్వహించి వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 
 
ఆ తర్వాత అతని శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా, అతనికి సోకింది ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. కానీ, బ్రిటన్‌లో ఆ బాలుడు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం రావడం గమనార్హం. ప్రస్తుతం ఆ బాలుడి ప్రైమరీ కాంటాక్ట్‌లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే, గోవాలో తొలి ఒమిక్రాన్ కేసు కూడా ఇదే కావడం గమనార్హం. 
 
నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 10 మందికి ఒమిక్రాన్ 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతుంది. ఎట్ రిస్క్ దేశాలే కాదు.. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో కూడా ఈ వైరస్ కనిపిస్తుంది. తాజాగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో 10 మందికి ఈ ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. వీరిని కలిసిన వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణా రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 55కి చేరింది. సోమవారం ఒక్క రోజే ఏకంగా 12 కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తం 55 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 10 మంది కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన మీడియా బులిటెన్ ప్రకారం మొత్తం 37,839 శాంపిల్స్ పరీక్షించగా, 182 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 90 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్‌లో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి.