1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Man kills wife with grinding stone after argument in Hyderabad

అనుమానం పెనుభూతమైంది - కుమారుడి ఎదుటే భార్యను రోకలి బండతో కొట్టి చంపేసిన భర్త

tejasri
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆగ్రహంతో రోకలి బండతో భార్యను తలపై బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తమ నాలుగేళ్ళ కుమారుడు చూస్తుండగానే ఈ దారుణం చిక్కడపల్లి ఠాణాపరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన నరేందర్‌కు తేజశ్రీ (25) అనే మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆరు నెలలుగా హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లిలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. 
 
నరేందర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న నరేందర్ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మరోమారు దంపతుల మధ్య గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నరేందర్ రోకలిబండతో తేజశ్రీ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆ సమయంలో నాలుగేళ్ల కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. భార్యను హత్యచేసిన తర్వాత నరేందర్ నేరుగా పోలీస్ స్టేషన్‍కి వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. చిక్కడపల్లి పోలీస్ ఏసీపీ రణవీర్ రెడ్డి, సీఐ మధుబాబులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాఁధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
గిటాన్‌ను ప్యాసింజర్ అనుకున్న ఏఐ - రూ.500 చలాన్