మంగళవారం, 17 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2026 (22:10 IST)

తీవ్రమైన డిప్రెషన్.. టవల్‌తో భార్యను హత్య చేసిన ఇస్రో రిటైర్డ్ అధికారి

Kochi toddler murder case
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో విషాదం చోటుచేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన రిటైర్డ్ అధికారి ఒకరు తీవ్రమైన ఒత్తిడితో భార్య మెడకు టవల్‌ చుట్టి హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీసులు కూడా నిర్దారించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దక్షిణ బెంగుళూరులోని బొమ్మనహళ్ళి ప్రాంతంలో ఉన్న ది వర్చ్యూసో అపార్టుమెంట్‌లో ఇస్రో మాజీ ఉద్యోగి నాగేశ్వర్ రావు (65), తన భార్య సంధ్యశ్రీతో కలిసి వుంటున్నారు. ఆయన తీవ్రమైన డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన తన భార్యను టవల్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. 
 
ఆ తర్వాత ఇంట్లోనే ఉండి తన పరిచయస్తుడు ఒకరికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఉదయం 11 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని నాగేశ్వర్ రావును అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చేంతవరకు నిందితుడు ఘటనా స్థలంలోనే ఉన్నాడు. 
 
పోలీసుల కథనం మేరకు.. నాగేశ్వర రావు గత కొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఆయన.. తాను చనిపోయేముందు భార్యను కూడా చంపేయాలని నిర్ణయించుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
నిందితుడు డిప్రెషన్‌తో చాలా ఒత్తిడిలో ఉన్నాడు. ఘటన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని భావించి భార్యపై దాడి చేశాడు. దీని వెనుక ఇతర పెద్ద కారణాలేవీ లేవని తెలుస్తోంది అని వైట్ ఫీల్డ్ డీసీసీ సైదుల్ అదవత్ మీడియాకు తెలిపారు. కాగా, ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె అమెరికాలో ఉండగా, జరిగిన విషయాన్ని పోలీసులు చేరవేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.