భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?
కుటుంబ కలహాలతో ఒక భార్య, భర్త నాలుకను కొరికేసింది. ఈ సంఘటన తర్వాత భార్య గదిలోకి వెళ్లి కొడవలితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝలావర్ జిల్లా బకానీ పట్టణంలో గురువారం జరిగింది. కుటుంబ కలహాలతో కోపంగా ఉన్న మహిళ తన భర్త నాలుకను కొంతభాగం కొరికేసిందని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు.. బకానీ పట్టణానికి చెందిన కన్హయ్యలాల్ సైన్ (25) అనే వ్యక్తికి పక్క గ్రామమైన రవీనా సైన్‌తో ఒక యేడాదిన్నర క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఈ జంట మధ్య తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ తరచుగా గొడవపడేవారు. గురువారం రాత్రి కూడా గొడవకు దిగారు. సదరు మహిళ కోపంతో కన్హయ్య లాల్ నాలుకలో కొంతభాగాన్ని కొరికేసింది.
కుటుంబీకులు కన్హయ్యని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని ఝులావర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాలుకను తిరిగి ఆపరేషన్ ద్వారా అతికించవచ్చని వైద్యులు చెప్పారని వెల్లడించారు. అలాగే, మణికట్టు కోసుకోవడంతో తీవ్రరక్తస్రావమైన భార్యను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై స్థానిక పోలీసులు బీఎన్ఎస్ 115 (2), 118 (2), (23)సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.