బుధవారం, 12 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 నవంబరు 2025 (09:58 IST)

అనుమానం పెనుభూతమైంది.. భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేసిన భర్త

murder
అనుమానం పెనుభూతమైంది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. తనకు భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త అత్యంత కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఆమెను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
పోలీసుల కథనం మేరకు... ప్రకాశం జిల్లా గుంటూరుకు చెందిన చెవుల బ్రహ్మయ్య, కృష్ణవేణి (37) దంపతులు గత కొంతకాలంగా అమీన్ పూర్‌లో ఉంటున్నారు. కృష్ణవేణి కోహిర్‌లోని డీసీసీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తుండగా, బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
అయితే, గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకున్నారు. ముఖ్యంగా తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని గట్టిగా నమ్మిన బ్రహ్మయ్య... భార్యతో తరచూ గొడపడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోమారు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బ్రహ్మయ్య.. ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్తో కృష్ణవేణి తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.