గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (08:06 IST)

కోవిడ్-19ను నియంత్రించడంలో వస్త్రంతో చేసిన మాస్కు ఉత్తమం

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న మార్గాల్లో ప్రధానమైనది మాస్కును ధరించడం.

మాస్కులను ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు ఇతరులకు కూడా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రెస్పిరేటరీ మాస్కులు, సర్జికల్ మాస్కులకు ఇంట్లో తయారు చేసుకున్న కాటన్ మాస్కులు ఏమాత్రం తీసిపోవని వైద్యులు చెబుతున్నారు.

ఇప్పుడు ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కూడా ధృవీకరించింది. ఇంట్లో తయారు చేసుకున్న కాటన్ మాస్కులపై జరిగిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్కుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న మల్టీలేయర్ మాస్కులే ఉత్తమమైనవని సీడీసీ తెలిపింది. 
 
అదే విధంగా అవతలి వ్యక్తి దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సాధారణ వస్త్రం (ఉదా: టీషర్టు క్లాత్‌)తో తయారు చేసిన మాస్కులు మెడికల్‌ మాస్కులకు ఏమాత్రం తీసిపోవని, గాలి పీల్చుకునే సమయంలో అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఈ మేరకు జర్నల్‌ ఆఫ్‌ ఎక్స్ట్రీమ్‌ మెకానిక్స్‌ లెటర్స్‌ అధ్యయనంలో తమ పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో తయారు చేసుకున్న కాటన్ మాస్కులను వినియోగించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. 
 
ఎలాంటి మాస్కులు ధరించాలి? వాటిని ఎలా శుభ్రపరిచాలి? మాస్కును పారవేయాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఈ వైరస్ బారినుంచి తమను తాము రక్షించుకోవడంతోపాటు ఇతరులకు సోకకుండా మంచి చేసిన వారు అవుతారు.

ఎందుకంటే కోవిడ్ వైరస్ ను నియంత్రించడానికి ఎన్న ఏకైక మార్గం మాస్కును ధరించడమే. కాబట్టి మాస్కు విషయంలో ప్రతిఒక్కరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 
 
మాస్క్ ఎందుకు ధరించాలి?
కోవిడ్-19 వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినపుడు గానీ, దగ్గినపుడు గానీ ద్రవరూపంలో ఉండే తుంపర్లు గాలి ద్వారా ఎదుటివారి మీద పడే అవకాశం ఉంటుంది. మరికొందరిలో శ్వాసకోస వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ ఏరోసోల్స్‌ (తుంపర్లు)లో మూడు గంటల వరకు ఉంటాయని గుర్తించారు. అదే మనం మాస్కు ధరిస్తే వైరస్ మన శ్వాసవ్యవస్థలోకి ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తుంది. అందుకనే తప్పనిసరిగా ప్రతిఒక్కరూ మాస్కును ధరించాలి.
 
మాస్కును ధరించినా ఈ కింది జాగ్రత్తలను తీసుకోవాలి:
* ఎదుటివారికి కనీసం 1-మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి
* తలుపులు, లిఫ్ట్ బటన్స్ లాంటి వస్తువులను తాకినవెంటనే చేతులను శానిటైజర్ లేదా సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి
* మాస్కు ముందు భాగాన్ని లేదా ముఖాన్ని వీలైనంత వరకు తాకడం చేయకూడదు
* మాస్కును ముక్కుపైన మరియు గడ్డం కింద సరైన పద్ధతిలో ధరించండి
* మాస్కు మురికిగా ఉందా లేదంటే పాడైపోయిందేమో అన్నది పరిశీలించుకోవాలి
* మాస్కు లోపలి భాగం ముఖాన్ని మరియు ముక్కుని తాకుతూ కప్పి ఉంచుతుందో లేదో పరిశీలిచండి
* మాస్కు ధరించినపుడు ముఖానికి ఇరువైపులా గ్యాప్స్ లేకుండా సరిచూసుకోండి
* మీ మాస్కు ముక్కు, నోరును గడ్డాన్ని కప్పేలా ఉండేలా చూసుకోండి
* మాస్కును తీసివేసేటప్పుడు చేతులను శుభ్రం చేసుకోండి
* చెవుల దగ్గర ఉండే పట్టీలను మాత్రమే తాకుతూ మాస్కును బయటకు తీయాలి
* తీసేసిన మాస్కును శుభ్రంగా ఉండే బ్యాగు లేదా కంటైనర్లో ఉంచాలి
* మాస్కును తీసేసిన తర్వాత మరోసారి చేతులను శుభ్రం చేసుకోవాలి
* మాస్కును రోజుకు ఒకసారైనా సబ్బు లేదా డిటర్జెంట్ తో శుభ్రం చేసుకోండి. వీలైనంత వరకు వేడి నీళ్లయితే మంచిది. ఒకవేళ మామూలు నీటితో శుభ్రం చేసినా ఇస్త్రీ చేసి వాడుకోండి.
 
మాస్కు ధరించినపుడు చేయకూడనివి:
* వీలైనంత వరకు పాడైపోయిన మాస్కును ఉపయోగించవద్దు
* ముఖానికి లూజుగా ఉండేలా ఉన్న మాస్కును ధరించవద్దు
* ముక్కు కిందికి వచ్చేలా ఉండే మాస్కులను వాడకూడదు. అలా లూజుగా ఉంటే వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
* మీకు 1 మీటరులోపు జనం ఉన్నట్టయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్కును తీయవద్దు
* శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే మాస్కులను ఉపయోగించవద్దు
* మురికిగా ఉండే, తడిగా ఉండే మాస్కులను ధరించకూడదు
* మీరు ఉపయోగించిన మాస్కులను ఇతరులతో పంచుకోవద్దు.