సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

యువతపై కోవిడ్-19 తీవ్ర ప్రభావం

కోవిడ్-19 వైరస్ తీవ్రత మెజార్టీ కేసుల్లో మరీ అంత ప్రాణాంతకమైనది ఏం కాదు. అయితే ఆ వైరస్ వివిధ దశల్లో చూపే ప్రభావాన్ని ప్రజలు అంచనా వేయలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు   అంటున్నారు.
 
మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం లాంటి అంశాల్లో అవగాహన వచ్చినప్పటికీ లక్షణాలను గుర్తించడం, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో ఆస్పత్రులకు వెళ్లే విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. 
 
మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత యువత బయట తిరగడం, మాస్కులు లేకుండా వాహనాలపై ప్రయాణించడం కూడా కోవిడ్ వ్యాధి విస్తృతికి కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. 
 
మన రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 40ఏళ్లలోపు వారు అత్యధికంగా ఉన్నారని.. యువత మరింత అప్రమత్తంగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అదే సమయంలో కోవిడ్ లక్షణాలు ఉంటే ఫలానా మందులు వాడండి, ఫలానా కషాయం తాగండి అని సోషల్ మీడియాలో వస్తున్న వాటిని పాటించి సమస్యను కొనితెచ్చుకుంటున్నారు. అందుకే కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
 
జ్వరం వస్తే అశ్రద్ధ వద్దు
ఓవైపు కోవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంటే.. మరోవైపు సీజన్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దగ్గు, జలుబు, జ్వరం సాధారణమే అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. 
 
రోజుల తరబడి జ్వరంతో బాధపడుతున్న వారు ఊపిరాడని స్థితిలో మాత్రమే ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆసమయంలో వైరస్ శాతం అధికంగా ఉండటం, ఊపిరితిత్తులు చాలా వరకు దెబ్బతినటం వల్ల వారిని కాపాడటం చాలా కష్టమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ప్రాణనష్టం జరిగిన కేసుల్లో అధికశాతం ఇలాంటి నిర్లక్ష్యమే కారణంగా చెప్తున్నారు. అందుకే జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. 
 
లక్షణాలుంటే వెంటనే కోవిడ్ టెస్ట్ లకు వెళ్లండి- నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
 
ఇప్పటికీ అనేక మందికి కోవిడ్ లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. లక్షణాలు తీవ్రమైనపుడు, శ్వాస తీసుకోవడంలో తీవ్క ఇబ్బంది కలిగినపుడు మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారు.

పరిస్థితులు తీవ్రమై టెస్టు చేయించే సరికి ఆలస్యమై చికిత్స అందకుండానే ప్రాణాలు పోతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అందుకే కోవిడ్ లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యంగా ఉండకుండా వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోండి లేదంటే స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించండి.
 
సొంతంగా చికిత్స వద్దు
ప్రస్తుతం చాలా మంది కోవిడ్ కు సంబంధించిన వైద్యం అంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సొంత వైద్యం చేసి కొన్ని రోజులపాటు ఇంటి వద్దే కాలయాపన చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు ముందు నిర్ణయం కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ధైర్యంగా ఉందాం-కోవిడ్ ను ఎదుర్కొందాం
కోవిడ్ బారినపడిన వారిలో అధికశాతం మంది మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం వంటి లక్షణాల కారణంగా చనిపోతున్నారు. కోవిడ్ నన్నేమీ చేయలేదు అనే గుండెనిబ్బరం ఉన్నవారు అత్యంత క్లిష్టపరిస్థితుల్లోకి వెళ్లినా తిరిగి కోలుకుంటున్నారు. అందుకే మానసికంగా దృడంగా ఉన్నవారు కోవిడ్ బారినుంచి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 
ఆవిరి పట్టుకోవడం- వేడినీరు, ఉప్పు లేదా బెటాడిన్ తో పుక్కిలించండి
కోవిడ్ బాధితులు పసుపు, జండూబామ్, జిందాతిలిస్మాత్ లేదా బ్రీత్ ఈజీ మాత్రలు వేడి నీటిలో వేసి ఆవిరి పట్టటం వలన ఊపిరితిత్తుల సమస్య చాలా వరకు తగ్గి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడుతున్నారని వైద్య నిపుణులు కూడా నిర్ధారించారు. చాలా మంది వైద్యులు కూడా ఆవిరి పట్టుకోవడాన్ని చికిత్సలో భాగంగానే చూడాలని చెప్తున్నారు.

అదే సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ అలాగే వేడి నీటిలో ఉప్పు వేసి గానీ, బెటాడిన్ గార్గిల్ ద్రావణాన్ని ఒక మూతకు 2 మూతల వేడి నీటితో కలుపుకుని ఉదయం, సాయంత్రం పుక్కిలిస్తే వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువంటున్నారు. వైరస్ బారిన పడిన వారు కూడా కోవిడ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు.
 
వేడి పదార్థాలు తీసుకోవడం మంచిది
కోవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న ఈపరిస్థితుల్లో ప్రజలంతా వీలైనన్ని సార్లు వేడినీరు, గ్రీన్ టీ, అల్లంటీ తీసుకోవడం, ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే మంచిది. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన ఆహార, పానీయాలను తీసుకోవటం ఎంత మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.
 
వైద్యం మరియు కౌన్సిలింగ్ చాలా అవసరం
చాలా మంది వాట్సప్, యూట్యూబ్, ఫేస్బుక్ వేదికగా వస్తున్న సమాచారం ఆధారంగా సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కరోనా గురించి అనుమానాలున్నా, కోవిడ్ సోకినా తప్పనిసరిగా నిపుణుల సలహాలు, కౌన్సిలింగ్ తీసుకోవాలి. తదనుగుణంగానే మందులు వాడాలి.
 
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా 104, 1902 కాల్ సెంటర్లతోపాటు ఆన్ లైన్ లో వైద్య సహాయం పొందడానికి వైఎస్ఆర్ టెలీమెడిసిన్ 14410 నంబర్, 8297104104 హెల్ప్ లైన్ నంబర్ ను అందుబాటులో ఉంచింది. ఈ నంబర్లకు కాల్ చేసి కోవిడ్ కు సంబంధించిన సమాచారంతోపాటు ఆస్పత్రుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు.