నరసాపురం - చెన్నై వందే భారత్ రైలు ప్రారంభం ... 17 నుంచి పూర్తి సేవలు
నరసాపురం - చెన్నై ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైలును కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మరాజు సోమవారం పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ రైలు సేవలు మాత్రం ఈ నెల 17వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకిరానున్నాయి.
కాగా, ఇప్పటివరకు చెన్నై సెంట్రల్ - విజయవాడ మధ్య నడుస్తున్న ఈ సెమీ హైస్పీడ్ రైలును గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడగించారు. ఈ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. మొత్తం 655 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల్లో పూర్తి చేయనుంది.
ఈ రైలు నరసాపురంలో ప్రతి రోజూ మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు చెన్నైకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి నరసాపురంకు మధ్యాహ్నం 2.10 గంటలకు వచ్చి చేరుతుంది. ఈ రైలు భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్లలో ఆగి వెళుతుంది.
ఈ వందే భారత్‌లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1635 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.3030గా నిర్ణయించారు. ఈ కొత్త సర్వీసుతో వాణిజ్య, వ్యాపార, పర్యాటక ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయని రైల్వే అధికారులతో పాటు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.