శనివారం, 15 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 నవంబరు 2025 (15:44 IST)

హిందూ ధర్మం ఎక్కడా నమోదు చేసుకోలేదు.. అందుకే ఆర్ఎస్ఎస్‌ను రిజిస్టర్ చేయలేదు: భగవత్

mohan bhagwat
ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదంటూ విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ తనదైనశైలిలో స్పందించారు. హిందూ ధర్మం ఎక్కడా కూడా నమోదు చేసుకోలేదని, అదేవిధంగా తాము కూడా ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వివిధ రాష్ట్రాలు ఆర్ఎస్ఎస్‌ను గుర్తింపులేని సంస్థగా పేర్కొంటున్నాయని తెలిపారు. అలాంటి గుర్తింపులేని సంస్థకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయని ఆయన గుర్తుచేశారు. 
 
తమ సంస్థ గుర్తింపు పొందిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏముంటాయని మోహన్‌ భాగవత్‌ నిలదీశారు. 1925లో ఆర్ఎస్ఎస్‌ను స్థాపించినట్లుగా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వంతో అధికారికంగా నమోదు చేయించాలా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్‌ను అధికారికంగా నమోదు చేసుకోవడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేయలేదన్నారు. ఆదాయపు పన్ను శాఖ, కోర్టులు ఆర్ఎస్ఎస్‌ను వ్యక్తుల సంఘంగా గుర్తించాయని.. దానిలో భాగంగానే దానిని పన్నుల నుంచి మినహాయించాయన్నారు. 
 
కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకుడు ప్రియాంక్‌ ఖర్గే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. అందులో ఆయన ఆర్ఎస్ఎస్‌ను గుర్తింపు లేని సంస్థగా పేర్కొన్నారు. ప్రభుత్వ మైదానాలు, ఉద్యానవనాలు, పాఠశాలల ఆవరణలు, క్రీడా మందిరాలు తదితరాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను బ్యాన్‌ చేయాలని కోరారు.