బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ
బీహార్ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు కలిసి దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన ఓట్ ఆధికార్ పేరుతో ఓ యాత్రను కూడా చేపట్టారు.
ఇందులోభాగంగా ఆయన శనివారం బీహార్ రాష్ట్రంలోని ఆరాలో ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ నేతలు తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్‌తో కలిసి రాహుల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బీహార్‌లో చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర' దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారుతుందన్నారు. మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలలో ఓట్లు చోరీ చేయడంలో ఎన్డీయే ప్రభుత్వం విజయవంతమైందని ఆరోపించారు.
బీహార్‌లో మాత్రం బీజేపీ, ఈసీని ఒక్క ఓటు కూడా చోరీ చేయనివ్వబోమని చెప్పారు. ర్యాలీలో పాల్గొన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో తాను కలిసి ఉన్న ఫొటోను ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ షేర్ చేశారు. 'ఇద్దరు సోదరులు కలిశారు. ఓట్ల దొంగలిక నాశనమే. ఈ యాత్రలో పాల్గొని నాకు, తేజస్వికి మద్దతిచ్చిన అఖిలేశ్‌కు ధన్యవాదాలు' అని రాహుల్ పేర్కొన్నారు.