చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు
వైకాపా చీఫ్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో హాట్‌లైన్ కనెక్షన్‌లో ఉన్నారని ఆరోపించారు. "ఈ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎన్నికల మోసం, ఓటుకు నోటు గురించి మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల మోసం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది, కానీ ఈ రాహుల్ గాంధీకి రాష్ట్రం గురించి మాట్లాడే సమయం లేదు. ఎందుకంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలతో హాట్‌లైన్ కనెక్షన్‌లో ఉన్నారు" అని జగన్ అన్నారు.
ఓట్ల చోరీ అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏపీలో 2024 ఎన్నికల నాటికి.. ఓట్ల లెక్కింపు సమయానికి 12.5శాతం ఓట్లు పెరిగాయన్న వైఎస్ జగన్.. 48 లక్షల ఓట్లు పెరిగాయని ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు.
ఇదే సమయంలో చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ముఖ్యమంత్రిగా ఉన్నావ్.. నీ జీవితానికి బహుశా ఇవే ఆఖరి ఎన్నికలు కావచ్చు.. రామా, కృష్ణా అని అనుకునే వయసులో.. కనీసం ఆ మాటలు అన్నా అనుకుంటే కాస్త పుణ్యమైనా వస్తుంది.ఈ మాదిరిగా చేసుకుంటూ పోతే నరకానికే పోతావ్. ఇప్పుడైనా కాస్త మార్పు తెచ్చుకో చంద్రబాబూ" అంటూ వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.