1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Bullet Train Project Amaravati Station Just 13 KM from Vijayawada

విజయవాడ సమీపంలో అమరావతి హై స్పీడ్ రైల్వే స్టేషన్ : కేంద్రం ఓకే

bullet train
దేశంలో బుల్లెట్ రైళ్ళ రాకకు సమయం ఆసన్నమైంది. ఇందులోభాగంగా తొలి రైలు వచ్చే యేడాది ముంబై  - అహ్మదాబాద్ నగరాల మధ్య పరుగులు పెట్టనుంది. అయితే, ఈ ప్రాజెక్టులో భాగంగా, మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ నుంచి చెన్నైకు వరకు నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించే రైల్వే స్టేషన్‌ను విజయవాడ నగరానికి అత్యంత చేరువలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ విజ్ఞప్తిని జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి.ఎల్) అంగీకారం తెలిపింది. దీని ప్రకారం, విజయవాడకు కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్టేషన్‌ను నిర్మించనున్నారు.
 
విజయవాడ నగరవాసులు బుల్లెట్ రైలు సేవలను సులభంగా అందుకునేందుకు వీలుగా స్టేషనన్‌ను దగ్గరగా నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. నగరానికి దూరంగా స్టేషన్ ఉంటే ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందన్న వాదనతో ఏకీభవించిన కార్పొరేషన్, ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. మొత్తం 760 కిలోమీటర్ల పొడవైన ఈ హైదరాబాద్ - అమరావతి - చెన్నై కారిడార్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి మీదుగా చెన్నైకి చేరుకుంటుంది. ఏపీ పరిధిలోని 518 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చింది.
 
ఏపీలో ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నప్పటికీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొన్న సందిగ్ధత కారణంగా మొత్తం ప్రాజెక్టులో జాప్యం నెలకొంది. హైదరాబాద్ నగరానికి దూరంగా అలైన్‌మెంట్ ఉందన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా, ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని రైల్వే బోర్డును కోరారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రష్యాలో విషాదం : కూలిన సైనిక విమానం - 19 మంది మృతి