1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana: Heavy Rainfall Recorded In Several Areas, More Rains Likely

తెలంగాణాలో జోరుగా కురుస్తున్న వర్షాలు... ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

Clouds, Rain And Heatwave
Clouds, Rain And Heatwave
తెలంగాణ రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా, దక్షిణ తెలంగాణ జిల్లాలైన్ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ నారాయణ పేటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 
 
ఈ వర్షాలు, ఖమ్మం, ములుగు, కొత్తగూడెంలలో ప్రారంభమైన వానలు.. జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకూ విస్తరించాయి. రానున్న కొన్ని గంటల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
 
మరోవైపు, రెండు రోజులుగా విరామం ఇచ్చిన వానలు శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయి. నగరం యొక్క దక్షిణ, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హయత్ నగర్‌లో అత్యధికంగా 63.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) పరిసరాల్లో 59.5, రాజేంద్ర నగర్‌లో 44.3, శివరాంపల్లిలో 44 మిల్లీమీటర్ల వర్షం పడింది.
 
మరోవైపు, తెలంగాణకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. సెప్టెంబరు 23-25 మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరం వైపుగా పయనిస్తే తెలంగాణలో వర్షాలు మరింత తీవ్రరూపం దాల్చవచ్చని దీని ప్రభావంతో ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వైష్ణవి హత్య కేసు : బావను చంపేసిన బామ్మర్ది అరెస్టు