1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Avanthi Father Laxma Reddy statement on Hyderabad interior designer brutally murdered

ప్రాణం కంటే పరువే ముఖ్యం.. అందుకే చంపేశాం : అవంతి తండ్రి

Avanthi
తమకు ప్రాణం కంటే పరువే ముఖ్యమని, అందుకే తన కుమార్తెను ప్రేమించి పెళ్ళి చేసుకున్న హేమంత్‌ను చంపేసినట్టు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు. 
 
తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. ఈ పరువు హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. 
 
ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యంగా అవంతి తండ్రి లక్ష్మారెడ్డితో పాటు మేనమామ యుగంధర్‌రెడ్డిలను చర్లపల్లి జైలు నుంచి గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. 
 
ఈ సందర్భంగా, హేమంత్‌తో తన కూతురు అవంతి  ప్రేమలో పడిందన్న విషయాన్ని తెలుసుకుని ఆమెను ఇంటి నుంచి బయటకు రానివ్వలేదని తెలిపాడు. దీంతో ఆమె ఇంట్లోంచి పారిపోయి హేమంత్‌ను పెళ్లి చేసుకుందని వివరించాడు. 
 
తన కుటుంబం ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావిస్తుందని చెప్పాడు. తన కూతురు అబ్బాయితో పారిపోవడంతో తమ ఊరిలో తలెత్తుకొని తిరగలేక పోయామని ఆయన వాపోయాడు. ఈ నేపథ్యంలో హేమంత్‌ను చంపేశామని తెలిపాడు.
 
కాగా, ఈ కేసులో పోలీసులు మరిన్ని విషయాలను రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ అవంతి, హేమంత్ కుటుంబ సభ్యులు బుధవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. దీనికి సజ్జనార్ సానుకూలంగా స్పందించిన విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వీవీఐపీల ప్రయాణం కోసం బోయింగ్777... మరికొన్ని గంటల్లో ల్యాండింగ్