సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (17:56 IST)

హేమంత్ - అవంతి తల్లులు మంచి స్నేహితులు : ఒకరి ఇంటి ఫంక్షన్‌కు మరొకరు...

హైదరాబాద్ నగరంలోని చాంద్‌నగర్‌లో జరిగిన పరువు హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మృతుడు హేమంత్ తల్లి రాణి, అవంతి తల్లి అర్చనలు మంచి స్నేహితులని పోలీసుల విచారణలో తేలింది. పైగా, ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు వెళ్లేవారని తెలిసింది. అలా కలిసిమెలిసివుంటూ తమ కుమార్తెను తీసుకెళ్లి హేమంత్ ప్రేమ వివాహం చేసుకోవడాన్ని అవంతి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
ఈ కేసును హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్టు చేశారు. అలాగే, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. హేమంత్, అవంతిలకు పరిచయం ఏర్పడకముందే వారిద్దరి తల్లులు క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది.
 
హేమంత్ తల్లి రాణి, అవంతి తల్లి అర్చన ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అవంతి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా హేమంత్ తల్లి రాణి బ్యూటీషియన్‌గా వెళ్లేంది. ఈ క్రమంలో హేమంత్ తల్లితో అవంతి దగ్గరైంది. ఆపై హేమంత్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. హేమంత్, అవంతిలు ప్రేమ వివాహం చేసుకోకముందు, ఇరువురి కుటుంబ సభ్యులు ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు వెళ్లేవారు. 
 
అలా ఎంతో కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటే.. హేమంత్ తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని అవంతి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. ఇదే ఇరు కుటుంబాల మధ్య చిచ్చురేపింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 14 మందిని రిమాండ్‌లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ సందీప్ రెడ్డి, ఆశిష్ రెడ్డి అనే మరో ఇద్దరు ఈ హత్యలో కీలక నిందితులని, హత్యకు పథకం వేసిందే వారిద్దరూ అని అవంతి ఆరోపిస్తోంది.
 
వారిద్దరినీ కూడా అరెస్టు చేయాలని హేమంత్ కుటుంబ సభ్యులు రేపు పోలీసులను కలిసి మరోసారి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి, ఆశిష్ రెడ్డి ఇద్దరూ పరారీలో ఉండడంతో వారిపై ఆరోపణలకు బలం చేకూరుతోంది.