సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:03 IST)

కీసర తాహసీల్దార్ లీలలు ఎన్నో.. ఎన్నెన్నో... రూ.2 కోట్ల నగదు లంచం డిమాండ్!!

తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన అవినీతి తిమింగలాల్లో కీసర మాజీ తాహసీల్దారు ఒకరు. ఈయన అవినీతికి అంతేలేదు. ఫలితంగా వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు పోగు చేసుకున్నారు. అయితే, ఆయన పంటపండటంతో ఇపుజు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా ఈ తాహసీల్దారు బాగోతం ఒకటి వెలుగులోకి వచ్చింది. రూ.48 కోట్ల భూ వివాదం పరిష్కారం కోసం ఏకంగా రూ.2 కోట్ల నగదు లంచాన్ని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ విషయం అవినీతి నిరోధక శాఖ అధికారులను దిగ్భ్రమకు గురిచేసింది. 
 
ఇటీవల భూరికార్డుల మార్పిడి కోసం రూ.1.1 కోట్లు లంచం తీసుకుంటూ ఈయన ఏసీబీకి చిక్కారు. మరో వ్యవహారంలో రూ. 2 కోట్లు తీసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాదంలో చిక్కుకున్న భూమి ఉన్నతాధికారుల పరిశీలనలో ఉండగానే తప్పుడు మార్గంలో పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు నాగరాజు డిజిటల్ సంతకం చేసినట్టు ఏసీబీ తాజా దర్యాప్తులో వెల్లడైంది. 
 
ఇందుకోసం ఏకంగా రూ.2 కోట్ల లంచం కూడా తీసుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో కందాడి ధర్మారెడ్డి పేరిట 1.02 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి కొత్త పాసుపుస్తకాలు జారీ చేస్తూ జులై 9న నాగరాజు డిజిటల్ సంతకం చేసినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. అలాగే, మార్కెట్ విలువ ప్రకారం రూ.48 కోట్ల విలువైన 24.16 ఎకరాల భూమి వివాదంలో ఉండగా, ఉన్నతాధికారుల వద్ద ఈ వ్యవహారం పెండింగులో ఉంది.
 
అయినప్పటికీ ఉన్నతాధికారులకు తెలియకుండా నాగరాజు అక్రమంగా పాస్ పుస్తకాలు జారీ చేసినట్టు గుర్తించారు. ఈ భూమి పేరిట 22 మార్చి 2010లో నకిలీ ఉత్తర్వులు సృష్టించినట్టు గుర్తించినా క్రిమినల్ కేసు నమోదు చేయించలేదు సరికదా, ఆ విషయాన్ని దాచిపెట్టి కొత్త పాస్ పుస్తకాలపై డిజిటల్ సైన్ చేసినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది. క్రిమినల్ మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.