మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఆస్తుల విలువ రూ.50 కోట్లు!!
ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ అవినీతి తిమింగిలాలు బయటపడుతున్నాయి. మొన్నటికిమొన్న ఓ తాహసీల్దారు కోట్లకు పడగలెత్తినట్టు గుర్తించారు. ఇపుడు ఓ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కూడా ఇదే తరహాలో అవినీతికి పాల్పడినట్టు తేలింది. ఈయన ఆస్తులు ఏకంగా రూ.50 కోట్లకు పైమాటగానే ఉన్నట్టు సమాచారం. ఆయన పేరు నర్సింహారెడ్డి. మల్కాజ్‌గిరి ఠాణాలో ఏసీపీగా పని చేస్తున్నారు.
ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా, పలు భూ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసి భారీగా ఆస్తులు సంపాదించినట్టు వచ్చిన పక్కా సమాచారంతో ఆయన నివాసంతో పాటు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (అనిశా) సోదాలు చేసింది. ఈ సోదాల్లో ఏసీపీ నర్సింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈయన మాజీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు కావడం గమనార్హం.
కాగా, ఈయన హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, మహేంద్రహిల్స్, డీడీ కాలనీ, అంబర్‌పేట, ఉప్పల్, వరంగల్‌లో 3 చోట్ల, కరీంనగర్‌లో 2 చోట్ల, నల్లగొండలో 2 చోట్ల, అనంతపూర్‌లో సోదాలు కొనసాగాయి. సికింద్రాబాద్ నివాసంలో భారీగా బంగారు, వెండి ఆభరణాలను అధికారులు గుర్తించారు. 2008 నుంచి 2010 వరకు మియాపూర్‌లో సీఐగా పని చేసిన నర్సింహారెడ్డి పలు భూవివాదాల్లో తలదూర్చి ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు. ఉప్పల్, మల్కాజ్‌గిరిల్లోనూ భూవివాదాల్లో ఏసీపీ తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.