మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జులై 2020 (08:52 IST)

సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ సిబ్బందికి కరోనా - మాజీ మంత్రికి పాజిటివ్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కరోనా కలకలం చెలరేగింది. క్యాంపు ఆఫీస్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో పది మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారితో పాటు వారు కాంటాక్ట్ అయిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు. 
 
ఈ నెల రెండో తేదీన క్యాంపు కార్యాలయం వద్ద వైద్య, ఆరోగ్యశాఖ కరోనా పరీక్షలను నిర్వహించింది. ఈ టెస్టు రిపోర్టులు శనివారం వచ్చాయి. ఈ టెస్టుల్లో 10 మందికి కరోనా సోకినట్టు తేలింది. కరోనా బారిన పడినవారిలో ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8 మంది, మరో బెటాలియన్‌కు చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
 
మరోవైపు, ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా పరీక్షలో తనకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని అన్నారు. 
 
కరోనా వస్తే భయపడాల్సిన పనిలేదని, రాకూడని జబ్బుగా భావించరాదని పేర్కొన్నారు. కార్లు, బస్సులు, ఇతర వాహనాల్లో భౌతికదూరం పాటించకపోతే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. 
 
వైరస్ భయంతో టెస్టులు చేయించుకోవడం మానుకోవద్దని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఇదేమంత ప్రమాదకరమైన వ్యాధి కాదని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా సందేశం అందించారు.