పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?
పిట్యూటరీ గ్రంథి. ఈ గ్రంథిని మాస్టర్ గ్రంథి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ, శరీరంలోని ఇతర ముఖ్యమైన గ్రంథులన్నింటినీ నియంత్రిస్తుంది. మెదడు కింద ఉన్న ఈ గ్రంథి, శరీరం యొక్క అనేక ముఖ్యమైన విధులను నిర్వహించడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, విడుదల చేస్తుంది.
పిట్యూటరీ గ్రంథి ప్రధాన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి గ్రోత్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది పిల్లలలో ఎముకలు, కండరాలు, ఇతర కణజాలాల పెరుగుదలను ప్రేరేపించి, వారి శారీరక అభివృద్ధికి తోడ్పడుతుంది. పెద్దలలో కండరాల నిర్వహణ, కొవ్వు పంపిణీకి కూడా ఈ హార్మోన్ అవసరం.
ఈ గ్రంథి థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి, జీవక్రియను నియంత్రించే థైరాక్సిన్ వంటి హార్మోన్లను విడుదల చేసేలా చేస్తుంది. దీనివల్ల శరీర శక్తి స్థాయిలు, ఉష్ణోగ్రత, బరువు సమతుల్యంగా ఉంటాయి. ఈ గ్రంథి సంతానోత్పత్తి, పునరుత్పత్తి శక్తికి కీలకమైనది. ఇది ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్లను విడుదల చేస్తుంది.
మహిళల్లో అండాల అభివృద్ధి, అండోత్సర్గము, ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి ఈ హార్మోన్లు సహాయపడతాయి. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి, టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి ఇవి తోడ్పడతాయి. ప్రసవం తర్వాత మహిళల్లో ప్రొలాక్టిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా తల్లిపాలు తయారయ్యేలా చేస్తుంది. పిట్యూటరీ గ్రంథి అడ్రినోకోర్టికోట్రోపిక్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది అడ్రినల్ గ్రంథులను ఉత్తేజపరచి, ఒత్తిడికి ప్రతిస్పందనగా కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. కార్టిసాల్ రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి ముఖ్యమైనది.
ఈ గ్రంథి యాంటీడియురేటిక్ హార్మోన్‌ను విడుదల చేయడం ద్వారా శరీరంలోని నీటి, సోడియం స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది మూత్రపిండాలు నీటిని నిలుపుకునేలా చేసి, శరీరం నిర్జలీకరణానికి గురికాకుండా కాపాడుతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్‌ను విడుదల చేయడం ద్వారా ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలకు సహాయపడుతుంది. తల్లీబిడ్డల మధ్య బంధం ఏర్పడటానికి తోడ్పడుతుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.