షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్ కాలికి గాయాలు
ఓ సినిమా షూటింగులో ప్రమాదం జరిగింది. ఇందులో హీరో డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయమైంది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజశేఖర్ తమిళంలో విజయవంతమైన 'లబ్బర్ పందు' అనే సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన కాలి చీలమండకు గాయమైంది. దీన్ని పరీక్షించిన వైద్యులు చీలమండలో క్రాక్స్ ఉన్నట్టు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత నాలుగు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
కాగా, రాజశేఖర్‌కు గాయం కావడంతో సినిమా షూటింగును తాత్కాలికంగా నిలిపివేశారు. చిత్రీకరణను తిరిగి వచ్చే యేడాది జనవరిలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా, రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. దాదాపు 27 యేళ్ల తర్వాత రమ్యకృష్ణ ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన నటిస్తున్నారు. కాగా, ప్రమాద వార్త తెలిసిన కొందరు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.