మంగళవారం, 9 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2025 (17:02 IST)

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

knife
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. నగరంలోని వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 యేళ్ల ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకుగురైంది. మేనమామ వరుసయ్యే యువకుడు.. ఆ యువతి తల్లి కళ్లముందే కత్తితో ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన యువకుడు.. ఘటనాస్థలిలోనే కత్తి, తన మొబైల్ ఫోన్ వదిలేసి పారిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, పోలీసులు వివరాలు సేకరించి, పరారీలో ఉన్న యువకుడు కోసం గాలిస్తున్నారు. అలాగే, ఈ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 
 
రోడ్డుకు అడ్డంగా బైకులు పార్క్ చేశారు.. తీయమన్నందుకు డ్రైవర్ గొంతు కోశారు... 
 
నెల్లూరు జిల్లా కేంద్రంలోని నక్కలోళ్ళ సెంటరులో పట్టపగలు దారుణం జరిగింది. కొందరు యువకులు మద్యం మత్తులో తమ బైకులను అడ్డుంగా పెట్టారు. వాటిని తీయాలని సిటీ బస్సు డ్రైవర్ కోరాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు.. డ్రైవరుతో వాగ్వాదానికి దిగారు. దీంతో కండక్టర్ కల్పించుకుని యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో పాటు డ్రైవర్‌కు అండగా నిలిచాడు. దీంతో మరింతగా రెచ్చిపోయిన పోకిరీలు బ్లెడుతో డ్రైవర్, కండక్టర్‌లపై దాడి చేశారు. ఆ తర్వాత బ్లేడుతో డ్రైవర్ గొంతుకోసి పారిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు ప్రాణాపాయస్థితిలో ఉన్న డ్రైవర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సిటీ సర్వీసు గాంధీబొమ్మ నుండి బోసుబొమ్మ వైపు వెళ్తుండగా, కొంతమంది యువకులు మద్యం మత్తులో తమ ద్విచక్ర వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. వాటిని తొలగించాలని డ్రైవర్ మన్సూర్ హారన్ కొట్టినా వారు ఏ మాత్రం పట్టించుకోకుండా దుర్భాషలాడారు.
 
దీంతో బస్సు దిగిన డ్రైవర్‌కు, యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో డ్రైవర్ మన్సూర్ ఒక ద్విచక్ర వాహనం యొక్క తాళం తీసుకుని బస్సును ముందుకు పోనిచ్చారు. ఆగ్రహంతో రగిలిపోయిన యువకులు మరో ద్విచక్ర వాహనంపై బస్సును వెంబడించి బోసుబొమ్మ వద్ద అడ్డగించారు. అనంతరం బస్సులోకి చొరబడి డ్రైవర్ మన్సూర్, కండక్టర్ సలాంపై బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
 
గాయపడిన ఇద్దరినీ స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. సమాచారం అందుకున్న సంతపేట ఇన్‌స్పెక్టర్ సోమయ్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను నగరానికి చెందిన మదన్, అతని స్నేహితులుగా గుర్తించి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.