సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (15:03 IST)

తండ్రి ప్రేమ అంటే కుమార్తెను విధవను చేయడమేనా? అవంతి ప్రశ్న

హైదరాబాద్‌లో పరువు హత్య జరిగింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అవంతి అనే యువతిని వైశ్య వర్గానికి చెందిన హేమంత్ అనే ఇంటీరియల్ డిజైనర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పైగా, వీరిద్దరూ ఎనిమిదేళ్ళ పాటు సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. యువకుడి తల్లిదండ్రుల అనుమతితో గత జూన్ నెలలో వివాహం చేసుకున్నారు. అయితే, తమ కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టంలేదని కోటీశ్వర దంపతులు... కిరాయి హంతకులతో అల్లుడిని చంపించారు. ఫలితంగా పెళ్లయిన నాలుగు నెలలకే కుమార్తె విధవగా మారింది. 
 
తన భర్తను హత్యకు గురైన ఘటనపై అవంతి మాట్లాడుతూ, తన తల్లిదండ్రులను ఎన్‌కౌంటర్ చేసి చంపేయాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లకు ఆమె విజ్ఞప్తి చేసింది. 
 
తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే తినే అన్నంలో విషం పెట్టి చంపేస్తామని తన తల్లి గతంలో హెచ్చరించిందని, ఇపుడు పెళ్లి చేసుకున్నందుకు నిజంగానే తన భర్తను అంతం చేశారంటూ వాపోయింది. తాను తన ఇష్టపూర్వకంగానే హేమంత్‌ వద్దకు వచ్చానని, తమ జీవితాన్ని తాము హాయిగా గడుపుతున్నామని చెప్పింది. తన భర్త హేమంత్ ఎవరినీ మాటలతో కూడా నొప్పించడని ఆమె చెప్పింది.
 
అన్యాయంగా తన భర్తను చంపేశారని తెలిపింది. తన పుట్టింటి వాళ్లు ధనబలం చూపిస్తారని చెప్పింది. తనకు హేమంత్‌తో ఎనిమిదేళ్ల నుంచి పరిచయం ఉందని, తాము ఇంటర్ చదువుతున్నప్పుడే ఆ అబ్బాయిని కలవద్దని తల్లిదండ్రులు చెప్పడం మొదలుపెట్టారని తెలిపింది. 
 
కొన్ని నెలల క్రితం ఇంట్లో బంధించారని, అనంతరం ఈ మూడు నెలల్లో అంతా జరిగిపోయిందని ఆమె చెప్పింది. తన దృష్టిలో తన తల్లిదండ్రులు చచ్చిపోయారని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల ప్రేమ అంటే.. కుమార్తెను విధవరాలిని చేయడమేనా అంటూ అవంతి సూటిగా ప్రశ్నించింది.