నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...
గత 2017 నాటి నటిపై లైంగికదాడి కేసులో కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, ఆయన మాజీ భార్య, సినీ నటి మంజు వారియర్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తిగా గౌరవం ఉన్నప్పటికీ బాధితురాలికి న్యాయం ఇంకా అసంపూర్తిగానే ఉందని పేర్కొన్నారు.
ఈ తీర్పుపై మంజు వారియర్ తన ఇన్‌స్టాలో ఓ సుధీర్ఘ పోస్ట్ చేశారు. గౌరవనీయ న్యాయస్థానపై నాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, ఈ కేసులో బాధితురాలికి న్యాయం ఇంకా పూర్తికాలేదు. కేవలం నేరం చేసిన వారికి మాత్రమే శిక్ష పడింది. ఈ ఘోరానికి ప్రణాళిక రచించి, అమలు చేసిన సూత్రధారి ఎవరైనా సరే వారు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇది చాలా భయానకరం అని ఆమె పేర్కొన్నారు.
ఈ నేరం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టినపుడే న్యాయం పూర్తవుతుందని మంజు స్పష్టంచేశారు. ఇది కేవలం ఒక బాధితురాలి సమస్య కాదు. కార్యాలయాల్లో, వీధుల్లో, జీవితంలో ధైర్యంగా, నిర్భయంగా తలెత్తుకుని నడవాలనుకునే ప్రతి అమ్మాయికి, ప్రతి మహిళ కోసమే నేను మాట్లాడుతున్నాను. నేను ఆమెతో పాటు అప్పుడూ ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటాను అని ఆమె తన పోస్టులో తేల్చి చెప్పారు.