రాజకీయాల్లోకి వచ్చాక ఆదాయం తగ్గిపోయింది .. ఖర్చులు పెరిగాయి : కంగనా రనౌత్
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిపోగా, ఖర్చులు బాగా పెరిగాయని బాలీవుడ్ నటి, లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, రాజకీయాలు అత్యంత కఠినమైన వృత్తి అని అన్నారు. పైగా, తాజాగా భాజపాకు చెందిన మరోనేత, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెప్పారు.
'రాజకీయాలు అత్యంత కఠినమైన ప్రొఫెషన్. తక్కువ జీతం వచ్చే వృత్తి ఇది. ఖర్చులు అయితే చాలా ఎక్కువ. రాజకీయ జీవితంలో ఉన్న కళాకారులు తమ వృత్తికి సమయం కేటాయిస్తే.. ఎగతాళికి గురవుతారు. రాజకీయరంగంలో ఉన్న నిపుణుల పట్ల ప్రజలు తమ అభిప్రాయాలు మార్చుకోవాలి. ఒక మంత్రిగా ఉన్నా లేక ప్రభుత్వంలో భాగమైనా.. మమ్మల్ని మా రంగంలో పనిచేసేందుకు అనుమతించాలి' అని తన కంగన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నారు.
రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు జీతం సరిపోదని గతంలో కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధులు, పీఏలతో తమ నియోజకవర్గాలకు వాహనాల్లో వెళ్లేందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని అన్నారు. నియోజకవర్గంలోని ఒక్కో ప్రదేశం 300-400 కి.మీ.ల దూరంలో ఉండటమే అందుకు కారణమన్నారు. రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంపీలకు వచ్చే జీతం సరిపోవట్లేదని, అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే చాలామంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాదులుగా ఉన్నారని ఆమె గుర్తుచేశారు.
కాగా, రాజకీయాల్లోకి వచ్చాక తన ఆదాయం బాగా తగ్గిపోయిందని, అందువల్ల కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని తాను భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. కేరళకు చెందిన ఆయన ప్రస్తుతం పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.