1. ఇతరాలు
  2. »
  3. మహిళ
  4. »
  5. కథనాలు
  6. Skin

Summer Time | Skin | Beauty | Face | Hair | Health | Water | వేసవిలో చర్మ సంరక్షణ!!

వేసవి కాలం
FILE
వేసవికాలంలో చర్మాన్ని చాలా పదిలంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో వేడి అధికంగా ఉండడం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. మండే ఎండలోనూ చాలా మందికి బయటకు వెళ్లకుండా ఉండలేరు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.

* రోజంతా చర్మం పై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది.

* చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.

* అన్నింటికంటే ముందుగా చేయాల్సింది ఎక్కువ నీటిని తాగడం. సాధారణంగా మిగతా కాలాల్లో మీరు తీసుకుంటున్న నీటి కంటే రెండింతలు అధికంగా తీసుకోవాలి.

* సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది.

* ఎండలో బయటకు వెళ్లడం తప్పదనుకుంటే ఎస్‌పీఎఫ్ 15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను శరీరంపై ఎండ పడే భాగాల్లో రాసుకోండి.

* అలాగే పల్చటి కాటన్ వస్త్రాలు, ముఖ్యంగా లైట్‌కలర్స్ ధరించడం మేలు. చేతులను కప్పివేసే షర్టులను ధరించండి. తలకు టోపి పెట్టుకోవడం లేదా గొడుగు వాడడం వల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.

* తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.

* అలాగే కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను కూడా తినవచ్చు.

* వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి. ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి.

* ఐస్‌తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది.

* స్క్రబ్బర్‌లను ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది.

* టమాటా, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్ కూడా తగ్గిపోతాయి. ముఖంపై ర్యాషెస్ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు.

* వేసవిలో కేశ సంరక్షణ కూడా చాలా ముఖ్యం. జుట్టును మరీ పొడవుగా ఉంచుకోకుండా వీలయినంత తక్కువగా ఉంచుకుంటే మంచిది. ఎండకు శిరోజాలు దెబ్బతినకుండా ఉండడానికి కండీషనర్ క్రీమును రాసుకోవడం తప్పనిసరి. హెన్నాచాలా చక్కని కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.

* వేసవిలో ఎక్కువగా స్విమ్మింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే స్విమ్మింగ్ ఎక్కువ సమయం చేయడంవల్ల నీళ్లలో ఉండే క్లోరిన్ కేశ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. కనుక స్విమ్మింగ్ చేసేటప్పుడు తప్పకుండా తలకు మాస్క్ ధరించడం మరచిపోవద్దు.