శివాని ఆత్మహత్య.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన.. ఆమె ఎవరు?
పోలవరం జిల్లాలోని ఈర్లపల్లి గ్రామంలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముర్రం శివాని మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రంపచోడవరం వద్ద జరిగిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో శివానితో జరిపిన సంభాషణను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు, ఆమె మరణం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు.
శివాని వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిందని, తన ఆశయాలను, విద్యాపరమైన లక్ష్యాలను తనతో పంచుకుందని ఆయన తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక గిరిజన విద్యార్థిని తన కలలను సాకారం చేసుకోకముందే మరణించడం బాధాకరమని అన్నారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సమస్యలు, కష్టాలను ఎదుర్కొనేటప్పుడు ధైర్యంగా ఉండాలని, ఒత్తిడికి లేదా నిరాశానిస్పృహలకు లోనుకావద్దని ముఖ్యమంత్రి విద్యార్థులు, యువతకు పిలుపునిచ్చారు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని పేర్కొన్న ఆయన, తమ బాధలు, ఆందోళనలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులతో పంచుకోవాలని యువతకు సూచించారు. విద్యార్థులు, యువతకు ప్రభుత్వం సాధ్యమైనంత మేర అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
