ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మార్చి 2026 (17:28 IST)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఇకలేరు

hj dora
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఇకలేరు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం డయాలసిస్‌ చేయించుకునేందుకు నిమ్స్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో పడిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మళ్లీ ఆయన్ను నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
 
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 1943లో హెచ్‌జే దొర జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందిన ఆయన.. 1965లో ఐపీఎస్‌లో చేరారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టేందుకు, సమర్థవంతమైన పోలీసింగ్‌ ద్వారా హింసను తగ్గించేందుకు విశేష కృషి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గానూ ‘పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ’ అవార్డు లభించింది. 
 
ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆయన హైదరాబాద్‌లో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీగా పని చేశారు. సీబీఐలో ఎస్పీగా పని చేసిన సమయంలో అంతర్రాష్ట్ర, ఆర్థిక నేరాలను ఛేదించడంలో నైపుణ్యం సంపాదించారు. స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌గానూ, సీఐడీ హెడ్‌గానూ సేవలందించారు. 1996 నవంబర్‌లో ఏపీ డీజీపీగా నియమితులై.. ఫిబ్రవరి 2002 వరకు ఐదేళ్లకుపైగా ఆ పదవిలో కొనసాగారు. 
 
డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత, సెప్టెంబర్‌ 11, 2002న సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌లో విజిలెన్స్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. దీనికి ముందు ఆయన సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గానూ సేవలందించారు. అవినీతి నిర్మూలన, ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత కోసం ఆయన కృషి చేశారు.