భారీ నష్టాల్లో హైదరాబాద్ మెట్రో రైల్ : భవిష్యత్ ఏంటి?
హైదరాబాద్ నగరంలోని మెట్రో రైలు ప్రాజెక్టు తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. మొదటి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవడం ద్వారా లాభాలబాట పట్టించాలనేది ప్రభుత్వ ఆలోచనగా వుంది. కానీ, స్వాధీన ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. లాభాల సంగతి పక్కనపెడితే నష్టాలు మరింతగా పెరిగాయి. ఎన్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సెప్టెంబరు 30వ తేదీతో ముగిసిన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అర్థ వార్షిక ఫలితాల్లో రూ.405.86 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు చూపించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే అర్థ భాగంలో నష్టాలు రూ.380.46 కోట్లుగా ఉండటం గమనార్హం.
మెట్రోరైలు ఆపరేషన్స్, ఇతరత్రా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఆరునెలల కాలంలో సమకూరిన ఆదాయం రూ.524.78 కోట్లుగా ఉంది. గతేడాది ఇదేకాలంలో రూ.497.54 కోట్లతో పోలిస్తే ఆదాయం స్వల్పంగా పెరిగింది. ఆరునెలల కాలంలో మెట్రో నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్మాణ, పరిపాలన వ్యయాలు, అప్పులపై వడ్డీ చెల్లింపులు, తరుగు కలిపి రూ.930.64 కోట్ల వ్యయం అయ్యింది. గతేడాది రూ.878 కోట్లుగా ఉంది.
మెట్రో నష్టాలకు ప్రధాన కారణం రుణాలపై కడుతున్న వడ్డీల భారమే. ఈ అర్ధ సంవత్సరంలోనే ఫైనాన్స్ ఖర్చులు రూ.522.61 కోట్లుగా ఉన్నాయి. వస్తున్న ఆదాయం వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. మెట్రో ఆపరేషన్స్ ఖర్చు ఆరునెలలకు గాను రూ.222.88 కోట్లు అయ్యింది.
మెట్రోరైలు మొదటిదశ ప్రాజెక్ట్ కోసం చేసిన రుణాలపై సగటున 7 నుంచి 8 శాతం వరకు వడ్డీని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో చెల్లిస్తుంది. మెట్రోని సర్కారు స్వాధీనం చేసుకునే సమయంలో ఈ రుణాలను రీ షెడ్యూల్ చేస్తుంది. వడ్డీకి రేటును సగానికి సగం తగ్గించుకోగల్గితే మెట్రోని లాభాల బాట పట్టించవచ్చు అనేది ప్రభుత్వ వ్యూహం.
అందుకోసమే రీషెడ్యూల్ చేసే రుణాలపై వడ్డీరేటు 3.5 నుంచి 4 శాతం లోపల ఇచ్చే బ్యాంకుల అన్వేషణను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించింది. ఈ ఆర్థిక సంవత్సర ఫలితాలను తీసుకుంటే అప్పులపై సుమారు రోజుకు రూ.2.85 కోట్ల వడ్డీ భారం పడింది.

