1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Low Pressure Area Likely Over Andaman Sea

అండమాన్ సముద్రంలో అల్పపీడనం .. 15 నుంచి తీరం వెంబడి వర్షాలు...

rain
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ దక్షిణ బంగాళాఖాతం మీదుగా తమిళనాడు, శ్రీలంక తీరం వైపు కదులుతున్నందున దక్షిణ భారతదేశ వ్యాప్తంగా వర్షాలు ఊపందుకోనున్నాయి. దీని ప్రభావంతో ముఖ్యంగా అక్టోబరు 14 నుంచి కోస్తాంధ్ర, తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, ఉరుములతో కూడిన కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 15న కూడా తీరం వెంబడి వర్షాలు కొనసాగుతాయని తెలుస్తోంది.
 
అక్టోబరు 16 నుంచి 19 మధ్య ఈ వర్షాలు క్రమంగా లోతట్టు ప్రాంతాలకు విస్తరించనున్నాయి. తమిళనాడులోని అంతర్గత ప్రాంతాలు, కేరళ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కర్ణాటక తీర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. తక్కువ సమయంలో తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో అక్కడక్కడా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ చివరి దశలో ఉన్నందున, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఈ వాతావరణ వ్యవస్థ ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి దోహదపడొచ్చని భావిస్తున్నారు. అక్టోబరు 15 నుంచి 20 మధ్య కాలంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం లేనప్పటికీ, గణనీయమైన వర్షపాతాన్ని ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వెండి దుకాణంలో ముసుగు దొంగలు.. రూ.13కోట్ల వెండిని దోచుకున్నారు..