1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Sai Krishna Case: Shocking Facts About rowdy sheeter Gade Sai Krishna Case

రౌడీ షీటర్ సాయికృష్ణ కేసు : పత్తాలేని కృష్ణలంక హెడ్ కానిస్టేబుళ్లు

appolice
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసులోని మిస్టరీ ఇంకా వీడలేదు. సాయికృష్ణ మృతి, శవం మాయం కేసులో కృష్ణలంక హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిల పాత్ర ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో వీరిద్దరూ గత కొన్ని రోజులుగా  కనిపించలేదు. 
 
ముఖ్యంగా, సాయికృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో పాత్ర ఉందని ఖరారు చేసిన నేపథ్యంలో వీరి కోసం వేట కొనసాగుతోంది. వీరిని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపర్చాలని సౌత్‌ ఏసీపీకి సిట్‌ అధికారులు ప్రొడక్షన్‌ ఆన్‌ మెమో ఇచ్చారు. ఈ కేసులో వీరిని సిట్‌ నిందితులుగా చేర్చింది. వారిద్దరినీ నగర సీపీ రాజశేఖరబాబు సస్పెండ్‌ చేశారు. వీరు దొరికితే కేసు చిక్కుముడి వీడొచ్చని భావిస్తున్నారు.
 
అలాగే, కృష్ణలంక స్టేషన్‌లో సీఐ నాగరాజుకు సన్నిహితులుగా ముద్రపడిన పదిమందిపై సిట్‌ గురిపెట్టింది. వీరిలో ఇప్పటికే ప్రైవేటు వ్యక్తి అయిన సురేష్‌.. సిట్‌ అదుపులోనే ఉన్నట్లు సమాచారం. అతని నుంచి పలు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ మురళీకృష్ణను రెండోసారి సిట్‌ పిలిచి విచారించింది. 
 
మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక కానిస్టేబుల్‌ బాబూరావునూ విచారించారు. ఇప్పటికే రెండు దఫాలు ప్రశ్నించారు. గత మూడు రోజులుగా సిట్‌ అదుపులోనే ఉన్నట్లు సమాచారం. స్టేషన్‌లో సెక్షన్‌ ఇన్‌ఛార్జి అయిన హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజునూ శనివారం పిలిచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. బాబూరావుతో పాటు మరో హోంగార్డును కూడా ప్రశ్నించారు. అతనూ సిట్‌ అదుపులో ఉన్నాడు. 
 
ఈ కేసులో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నానితోపాటు ప్రైవేటు వ్యక్తి అయిన సురేష్‌ను సిట్‌ అధికారులు నిందితులుగా చేర్చారు. ఈ మేరకు శనివారం నగరంలోని రెండో ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో మెమో దాఖలుచేశారు.
 
విచారణలో భాగంగా సిట్‌ అధికారులు.. సౌత్‌ ఏసీపీ మానసను శనివారం పిలిచారు. ఆమెపై సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సాయికృష్ణ అదృశ్యం గురించి మీకు ఎప్పుడు తెలిసింది? తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా? చేస్తే.. అందులో ఏం తేలింది? మృతదేహం ఏమైందని ప్రశ్నించారు. ఇన్‌స్పెక్టర్‌పై పర్యవేక్షణ అధికారి అయి ఉండి ఎందుకు పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లు తెలిసింది.
About Writer
ఠాగూర్