1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Viveka Murder Case : Avinash Rddy Request rejected by Supreme Court

వివేకా హత్య కేసు : అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

YS Avinash Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తన పిటిషన్‌ను విచారించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు అవినాష్‌ తరపు లాయర్లు బుధవారం మెన్షన్‌ చేశారు. అయితే అవినాష్‌కు సుప్రీంలో ఊరట దక్కలేదు. విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఖరారు చేయలేదు. విచారణ అత్యవసరమైతే రాతపూర్వక అభ్యర్థన ఇవ్వాలని.. దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సూచించారు. 
 
ఈ హత్య కేసు దర్యాప్తులో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విచారణకు హాజరుకావాలని ఈ కేసులో సహనిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి సీబీఐ అధికారులు ఇది వరకే నోటీసులు జారీ చేశారు. 
 
అయితే హైదరాబాద్‌లో అందుబాటులోనే ఉన్నా విచారణకు రాలేనని చివరి నిమిషంలో ఆయన సీబీఐకి సమాధానమివ్వడం.. ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపుతూ కడపకు బయలుదేరి వెళ్లడం.. అంతే వేగంతో సీబీఐ బృందం కడపకు చేరుకోవడం.. అవినాష్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఈ నెల 19న విచారణకు రావాలంటూ డ్రైవర్‌కు నోటీస్‌ ఇవ్వడం లాంటి పరిణామాలు ఉత్కంఠ రేకెత్తించాయి. 
 
వివేకా హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. అనూహ్యంగా కొత్త వ్యక్తుల పేర్లు తెర పైకి వస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోననేది ఉత్కంఠగా మారింది. 
తర్వాతి కథనం
తెలంగాణాలో టెన్త్ సిప్లమెంటరీ పరీక్షల టైం టేబుల్ రిలీజ్