వివేకా హత్య కేసులో ఈడీ విచారణ - నేడు అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదా?
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ముఖ్యంగా, ఈ హత్యకు రూ.40 కోట్ల డీల్ కుదిరింది. ఈ నిధులపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులోభాగంగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరినీ ఒక్కొక్కరిగా పిలిచి విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో వైకాపా లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డిని కూడా బుధవారం సుధీర్ఘంగా విచారణ జరిపారు. హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయంలో ఏకంగా 7 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. వివేకా హత్యకు కీలక కుట్రదారులు వెచ్చించాలనుకున్న రూ.40 కోట్ల మూలాలు, ఆ లావేదీలతో అవినాశ్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఆయన ప్రధానంగా విచారణ జరిగినట్టు సమాచారం.
హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులకు అడ్వాన్స్ చెల్లించిన రూ.కోట్ల సొమ్ము అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డిల నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి, ఆయన్నుంచి ఎర్ర గంగిరెడ్డి ద్వారా షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలకు చేరిందని అనుమానిస్తున్న ఈడీ.. ఈ కోణంలోనే ఎక్కువ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
అడ్వాన్స్ చెల్లించటానికి అంత భారీ నగదు ఎక్కడి నుంచి సమకూరిందనే అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. వాటితో తనకు ఎలాంటి సంబంధమూ లేదంటూ అవినాష్ రెడ్డి పొంతనలేని సమాధానాలిచ్చారు. దీంతో ఈడీ అధికారులు దర్యాప్తులో సేకరించిన లావాదేవీల ఆధారాలు, పత్రాలు, పలువురు సాక్షులిచ్చిన వాంగ్మూలాలను చూపి ప్రశ్నించినట్లు సమాచారం. అయినప్పటికీ అవినాశ్ రెడ్డి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించకపోవడంతో గురువారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.

