తగ్గిన కంపెనీ నికర లాభాలు... కార్ల ధరలను పెంచిన మారుతి
మారుతి కంపెనీ తమ కార్ల ధరలను మరోమారు పెంచేసింది. కంపెనీ నికర లాభాలు తగ్గిపోవడంతో మారుతి యాజమాన్యం ధరలను పెంచేసింది. ఏడాది వ్యవధిలో మారుతీ సుజుకీ కంపెనీ ధరలను పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ మేరకు నేడు ఎక్స్‌ఛేంజి ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ధర 0.31 శాతం పెంచినట్లు వెల్లడించింది.
'ముడి సరుకు ధరల ఒత్తిడి కారణంగా కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ధరలు పెంచాలని కంపెనీ నిర్ణయించింది. ఇది 22 నవంబరు 2026 నుంచి అమల్లోకి రానుంది. సగటు ధరల పెరుగుదల 0.31శాతం వరకు ఉండొచ్చు' అని మారుతీ పేర్కొంది.
తమ కార్ల ధరలను తగ్గించే యత్నం చేసినా.. వ్యయాల ఒత్తిడి కారణంగా కొంత భారం వినియోగదారులకు బదిలీ చేయాల్సి వస్తోందని వెల్లడించింది. ఈ క్రమంలో వీలైనంత తక్కువగా ఈ భారం ఉండేట్లు చూశామని వెల్లడించింది.
మారుతీ సుజుకీ 2026లో పలు మార్లు వాహనాల ధరలను పెంచింది. సెప్టెంబరులో కొన్నింటిపై రూ.20 వేల వరకు పెంపు ప్రకటించింది. దాని కంటే ముందు ఎరినా, నెక్సాలోని కొన్ని మోడళ్లపై ఆగస్టులో రూ.30 వేలు పెంచింది. జూన్‌లో కూడా ఒక సారి రూ.30 వేలు పెంచింది.
మారుతీ సుజుకీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభాల్లో 26.9శాతం తగ్గుదల కనిపించింది. రెవెన్యూ మాత్రం 26శాతం పెరిగి రూ.53,340 కోట్లకు చేరింది.

