1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
  4. Telugu Chennai Student write exams in tamil

చెన్నై: తమిళంలో పరీక్షలు.. తెలుగు భాష కనుమరుగవుతుందా? పాఠశాలలు, కాలేజీలు క్లోజ్!

Telugu
తమిళనాడులో తెలుగు భాష కనుమరుగువుతుందా..? తెలుగు భాషకు సంబంధించిన కళాశాలలలు మూతపడేందుకు తెరవెనుక చర్యలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలకు తెలుగు భాషాభిమానులు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మార్చిలో జరిగే పరీక్షలు తమిళంలోనే రాయమనడమని వారు అంటున్నారు. హైకోర్టు మైనారిటి భాషా విద్యార్థులకు వారి మాతృభాషలో పరీక్ష రాయడానికి అనుమతిస్తూ తాత్కాలిక వెసులుబాటు కలిగించింది. ఈ నేపథ్యంలో మైనారిటీ భాషల విద్యార్థులను విడిగా దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. అయితే కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా తమిళనాడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వ్యవహరిస్తోంది. 
 
మాతృభాషలో పరీక్ష రాస్తున్న అవకాశాన్ని కుంటి సాకులతో కాలరాస్తున్న కొంతమంది అధికారులు ఇప్పుడు దాని వెనుక మరో బలవంతపు కుట్రను అమలు చేసే యత్నాలు చేస్తున్నారు. మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నవిద్యార్ధులందరి అభ్యర్ధనను అధికారులు తిరస్కరించారు. ఇప్పుడు అదే విద్యార్ధులతో మాకు తమిళం నుంచి మినహాయింపు అవసరం లేదు అని వారే స్వచ్ఛందంగా లేఖ రాసిచ్చేలా పథకం అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మాదిరి లేఖలన్ని ఆయా పాఠశాలకు వెళ్లాయి. కొంతమంది  విద్యార్ధులతో సంతకాలు కూడా అక్కడ ఉపాధ్యాయులు కొంతమంది బలవంతం చేసి పెట్టించారని సమాచారం. ఇదే జరిగితే ఇక న్యాయస్థానంలో పోరాడటానికి అవకాశం ఉండదు. ఈ ప్రయత్నాన్నిఅడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలుగు ఉపాధ్యాయులు అంటున్నారు.
 
మైనార్టీ భాషా విద్యార్ధుల అభ్యర్థనలను విద్యాశాఖ తిరస్కరించడం‌పై విద్యార్ధులు కోర్టుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. బుధవారం కొంతమంది విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ పంపిన లేఖలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో తమిళనాడు మైనార్టీ భాషల ఫోరం కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశాలున్నాయి. తెలుగు సంఘాల ప్రముఖులు కొంతమంది ఇప్పటికే న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి న్యాయపోరాటం ఎలా చేయాలనేదానిపై చర్చించారు. న్యాయపోరాటంతో పాటు తెలుగు, మైనార్టీ భాషా పరిరక్షణ కోసం మైనార్టీ‌లందరూ ఏకతాటిపై వచ్చి ప్రజా ఆందోళనలు పెద్ద ఎత్తున చేయాలని కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
అయితే నిర్భంధ తమిళం కొనసాగితే మాత్రం తమిళనాట తెలుగు భాష కనుమరుగవుతుందని భాషా పండితులు అంటున్నారు. తమిళనాడులోని ఇతర భాషలకు చెక్ పెట్టి.. తెలుగును లేకుండా చేయాలని తమిళనాడు సర్కారు భావిస్తోంది. ఇదే తంతు కొనసాగితే తమిళనాడులోని తెలుగు పాఠశాలలు, యూనివర్శిటీలు త్వరలో మూతపడే అవకాసం ఉందని భాషాభిమానులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇప్పటికే తెలుగువారు మేల్కొని తమ భాషను పరిరక్షించుకోవాలని లేకుంటే చెన్నపురిలో తమిళం కనుమరుగవడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషకులు అంటున్నారు. సో ఇప్పటికైనా తెలుగు సంక్షేమ సంఘాలు ఏకమై తమ భాషన కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచిస్తున్నారు. 
About Writer
Chitra