1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus India Live News Update: Over 20 Lakh COVID-19 cases registed

కరోనా మహమ్మారి దూకుడు : దేశంలో 20 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

Coronavirus
కరోనా వైరస్ మహమ్మారి దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటేసింది. గురువారం సాయంత్రానికే ఈ సంఖ్యను దాటేసింది. ఇక ప్రపంచ స్థాయిలో చూసుకుంటే కరోనా కేసుల విషయంలో 28 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా, 50 లక్షలకు పైగా కేసులతో అమెరికా తొలి స్థానంలోనూ, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. 
 
అయితే, జూలై 28 నాటికి ఇండియాలో కేసుల సంఖ్య 15 లక్షల మార్క్‌ను తాకగా, ఆ తరువాత కేవలం 9 రోజుల వ్యవధిలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ఈ మహమ్మారి వేగాన్ని చెప్పకనే చెబుతోంది. సరాసరిన రోజుకు 50 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. 
 
అయితే, అదేసమయంలో ఈ వైరస్ బారినపడి కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అంటే రికవరీ రేటు ఎక్కువైంది. ఇప్పటివరకూ 13.28 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.
 
వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 40 వేలను దాటింది. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కొత్త కేసులు వస్తున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే 4.6 లక్షలకు పైగా కేసులుండటం గమనార్హం. 
 
తొలుత కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత న్యూఢిల్లీలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో దేశ రాజధానిలో 1,299 కేసులు మాత్రమే వచ్చాయి. 15 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 
తర్వాతి కథనం
మెగాస్టార్ ఆశీర్వాదాలు తీసుకున్న ఏపీ బీజేపీ నూత‌న సార‌థి సోము వీర్రాజు