కరోనా రోగుల వార్డుల్లోకి నేరుగా వెళ్ళిపోయిన మంత్రి, ఎప్పుడు, ఎక్కడ?
సాధారణంగా కరోనావైరస్ రోగులు ఉండే ప్రాంతానికి వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. కేవలం వైద్య సిబ్బంది మాత్రమే వెళుతుంటారు. వారు కూడా పిపిఈ కిట్లు వేసుకుని అతి జాగ్రత్తగా వెళుతుంటారు. కానీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నాని మాత్రం ప్రభుత్వ అధికారులకు చెప్పకుండా ఉన్నట్లుండి కరోనా బాధితుల వార్డుల్లోకి వెళ్ళారు. దీన్ని చూసిన వైద్య సిబ్బందే ఆశ్చర్యపోయారు.
తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి ఆళ్ళ నాని. ఆయన పర్యటన ప్రకారం స్విమ్స్ ఆసుపత్రిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధితులతో మాట్లాడాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆయన కరోనా రోగుల వార్డుల్లోకి నేరుగా వెళ్ళిపోయారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తను వెంట తీసుకుని మరీ వెళ్ళారు మంత్రి ఆళ్ళ నాని. కరోనా రోగులతో స్వయంగా మాట్లాడారు. ఎలాంటి సౌకర్యాలు ఆసుపత్రిలో అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వైద్యసదుపాయాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకున్నారు. ఎపిలో కరోనా రోగుల కోసం 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. కరోనా వైరస్ తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి చెప్పారు.