శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (12:39 IST)

ఏపీ మంత్రి ధర్మాన కుమారుడికి కరోనా.. రోజా గన్‌మెన్‌కు కూడా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కృష్ణదాస్ కుమారుడుకి కరోనా వైరస్ సోకింది. అలాగే, నగరి ఎమ్మెల్యే, అధికార పార్టీ సీనియర్ మహిళా నేత ఆర్కే. రోజా గన్‌మెన్‌కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అటు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌‌తో పాటు.. ఇటు ఆర్కే రోజా కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. 
 
బుధవారం జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో కృష్ణదాస్‌తో పాటు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే సీతారాం కూడా హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. మరో రెండు వారాల పాటు మంత్రి, స్పీకర్ క్యాంపు కార్యాలయాలకు కార్యకర్తలు, ప్రజలు ఎవరూ రావద్దని అక్కడి అధికారులు కోరారు.
 
అలాగే గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాస్ తరపున ఆయన కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా స్వల్ప అస్వస్థతతో ఉన్న ఆయనకు, వైద్యులు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనతో పాటు తిరిగిన కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. 
 
ఇంకోవైపు, తాజగా ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌ కూడా కరోనా బారినపడ్డారు. తిరుపతిలోని స్విమ్స్ ఆయన్ను తరలించి చికిత్స అందిస్తున్నారు. రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ రావడం.. ఆమె ఇటీవల మాస్క్ లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో.. వైసీపీ కార్యకర్తలు ఆందోళన నెలకొంది. 
 
కానీ తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కరోనా బారిన పడిన తన గన్‌మెన్ సెలవుల్లో వున్నాడని రోజా చెప్పారు. 18 రోజులుగా విధులుగా రావడం లేదని చెప్పారు. అయినప్పటికీ ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 23,814 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 12,154 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 277 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 11,383 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.