కాశ్మీర్‌లో వేలెట్టకండి.. మాడిమసైపోతారు : చైనాకు భారత్ వార్నింగ్
భారత్‌లో అంతర్భాగమైన కాశ్మీర్ అంశంలో మరోమారు వేలు పెట్టేందుకు డ్రాగన్ కంట్రీ (చైనా) తహతహలాడుతోంది. గతంలో అనేకసార్లు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించి భంగపాటుకు గురైంది. ఇపుడు మరోమారు ఐక్యరాజ్య సమితి వేదికగా ఈ అంశాన్ని లేవనెత్తేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ పసిగట్టి, గట్టి హెచ్చరిక చేశారు. కాశ్మీర్ అంశంలో వేలుపెట్టకండి... మాడిమసైపోతారు అంటూ తీవ్ర హెచ్చరిక చేసింది.
ఈ విషయంపై కేంద్ర విదేశాంగ శాఖ గురువారం స్పందిస్తూ.... 'జమ్మూ కాశ్మీర్ గురించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చను లేవనెత్తేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు మా దృష్టికి వచ్చాయి. గతంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి అనుభవాలు వచ్చాయో... ఇప్పుడూ అదే విధంగా వస్తాయి. మా దేశ అంతర్గత విషమయమైన కాశ్మీర్ అంశంలో చర్చలు జరగాలని చైనా కోరుకోవడం ఇదే ప్రథమం కాదు. అనవసర ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు. అనవసరంగా భంగపడకండి' అని విదేశాంగ శాఖ హితవు పలికింది
ఇదిలావుండగా, జమ్మూకాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేసి బుధవారంతో యేడాది అయింది. ఈ సందర్భంగా చైనా తలోని అక్కసు వెళ్లగక్కింది. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇలా రెంటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం చట్ట విరుద్ధమని, ఇలా ఏకపక్షంగా చేయడం చెల్లదని పేర్కొంది. కాశ్మీర్ విషయంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన విభేదాలను కేవలం చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. కాశ్మీర్ పరిణామాలను తాము చాలా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నామని వెల్లడించారు.
'కాశ్మీర్ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తున్నాం. కాశ్మీర్ విషయంలో మా వైఖరి చాలా స్పష్టంగా, స్థిరంగానే ఉంది. ఈ సమస్య ఇరు దేశాల చరిత్రలో మిగిలిపోయిన అంశం. యథాతథ స్థితిలో ఉన్న వాటిల్లో ఏ మార్పు చేసినా అది ఏకపక్షమే. చట్ట విరుద్ధమే. ఈ అంశాన్ని రెండు దేశాలూ శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి' అని పేర్కొన్నారు. ఇపుడు ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తేందుకు ప్రయత్నిస్తోది. దీనికి భారత్ ఆరంభఫంలోనే గట్టగా కౌంటరిచ్చింది.