భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి దరఖాస్తుల ఆహ్వానం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. భారత క్రికెట్ సీనియర్ పురుషుల జట్టు ఎంపిక కమిటీలో ఖాళీగా ఉన్న ఒక సభ్యుడి పదవి భర్తీకి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబరు 4వ తేదీతో ముగిసింది. పదవీకాలం పొడిగింపును కోరబోనని అగార్కర్ గతంలోనే స్పష్టం చేయడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ పదవికి దరఖాస్తు చేసుకునే వారు అక్టోబరు 14 సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. బీసీసీఐ నిర్దేశించిన అర్హతల ప్రకారం, అభ్యర్థులు కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ - క్లాస్ మ్యాచ్‌ల లేదా 10 వన్డేలతో పాటు 20 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల ఆడి ఉండాలి. క్రికెట్ నుంచి రిటైరై కనీసం 5 సంవత్సరాలు పూర్తి కావాలన్న నిబంధన కూడా ఉంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, షార్టిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ప్రస్తుతం అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక ఛైర్మన్ వ్యవహరిస్తున్నాడు.
ఇదిలావుండగా, ఇటీవలే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గౌహతిలో సెలక్షన్ కమిటీ సమావేశమైంది. న్యూజిలాండ్ జరగనున్న 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ కోసం జట్టు ఎంపికపై చర్చించింది. ఈ సమావేశానికి బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, తాత్కాలిక చైర్మన్ ప్రజ్ఞాన్ ఓజా, ఆర్.పి. సింగ్ హాజరయ్యారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల ఫిట్నెస్, గాయాల సమాచారం, యువ ఆటగాళ్ల ప్రతిభను మెరుగ్గా అంచనా వేసేందుకు ఇకపై అన్ని సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు వీవీఎస్ లక్ష్మణ్ హాజరుకావాలని ఆదేశించింది. ఇది సెలక్షన్ ప్రక్రియలో మరింత పారదర్శకత, సమన్వయం తీసుకువస్తుందని బోర్డు భావిస్తోంది.
