1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Cicada COVID Variant Spreading in US: Can New BA.3.2 Evade Vaccines Check Symptoms, Risks

అమెరికాను వణికిస్తున్న 'సికాదా' - భారత్‌లోకి ఎంట్రీ కానుందా?

cikada virus
అగ్రరాజ్యం అమెరికాను కరోనా సబ్ వేరియంట్‌గా గుర్తించిన సికాడా వణికిస్తోంది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన బీఏ.3.2 అనే వేరియంట్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తూ అమెరికా పౌరులను వణికిస్తోంది. ఇప్పటివరకు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. గత 2024లో తొలిసారి సౌతాఫ్రికాలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఇది క్రమంగా 23 దేశాలకు వ్యాపించింది. ఇపుడు అమెరికాలో కనిపించి కలకలం రేపుతోంది. 
 
గతంలో 2022లో కనిపించిన బీఏ.3 వేరియంట్ నుంచే 'సికాదా' పుట్టుకొచ్చింది. చాలాకాలం పాటు ఎలాంటి ఉనికి లేకుండా ఉండి, హఠాత్తుగా మళ్లీ తెరపైకి రావడంతో దీనికి ఈ పేరు పెట్టారు. దీని స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 70 నుంచి 75 కొత్త మ్యూటేషన్లు ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
 
ఈ మార్పుల వల్ల గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా లభించిన రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం దీనికి ఉండవచ్చని అమెరికా సీడీసీ పేర్కొంది. అయినప్పటికీ, ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని 'వేరియంట్ అండర్ మానిటరింగ్' జాబితాలో చేర్చి, నిశితంగా గమనిస్తోంది. 
 
'సికాదా' లక్షణాలు చాలావరకు పాత ఒమిక్రాన్ వేరియంట్లను పోలి ఉన్నాయి. గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, అలసట, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటివి ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. కొందరిలో వికారం, వాంతులు, విరేచనాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుత వ్యాక్సిన్లు జేఎన్.1, LP.8.1 వేరియంట్ల కోసం రూపొందించినప్పటికీ, 'సికాదా' సోకినా తీవ్రమైన వ్యాధి బారిన పడకుండా, మరణం ముప్పు నుంచి వ్యాక్సిన్లు బలమైన రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
 
అయితే, ప్రస్తుతానికి భారత్‌లో 'సికాదా' వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో ఈ వేరియంట్ కారణంగా కేసుల పెరుగుదల ఎక్కదా నమోదు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు కూడా స్వల్ప లక్షణాలతోనే ఉన్నాయని, సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని నిపుణులు సూచిస్తున్నారు.
తర్వాతి కథనం
సినిమాల్లో నటించాలనే ఆశతో భాగ్యనగరికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు... (వీడియో)