శుక్రవారం, 3 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2026 (19:47 IST)

ఇరాన్‌పై యుద్ధంలో విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్

donald trump
ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌లు విజయం సాధించాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా సైనిక చర్యలతో టెహ్రాన్ సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేశామని, తమ వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరుతున్నాయని, త్వరలోనే ఈ పనిని పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నెల రోజుల క్రితం ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్‌పై వేగంగా విజయం సాధించామని తెలిపారు. ఈ ఆపరేషన్‌తో ఇరాన్ నౌకాదళం, వాయుసేన శిథిలమయ్యాయని తెలిపారు. తాము చేపట్టిన యుద్ధంలో ఇరాన్‌కు చెందిన అనేక మంది అగ్రనేతలను కోల్పోయిందన్నారు. ఇస్లామిక్  రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కమాండ్ వ్యవస్థను ధ్వంసం చేశామని తెలిపారు. ఈ కారణంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. 
 
చర్చలు విఫలమైతే ఇరాన్‌ను రాతి యుగంలోకి నెట్టేస్తాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం కుదరని పక్షంలో ఇరాన్‌ విద్యుత్ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పునరుద్ఘాటించారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమైతే రాతి యుగంలోకి నెట్టేస్తామని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇరాన్‌లో మార్పు తమ లక్ష్యం కాకపోయినా కీలక నాయకుల మరణంతో అది ఇప్పటికే జరిగిపోయిందన్నారు. 
 
అమెరికా చమురు కొనండి లేదా.. హర్మూజ్ జలసంధి మర్గాన్ని మీరే తెరుచుకోండి : ట్రంప్ 
 
ఇరాన్ ఆధీనంలో ఉన్న హర్మూజ్ జలసంధి జలరవాణా మార్గాన్ని మీరే తెరుచుకోవాలని మిత్ర దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచించారు. ఆయన బుధవారం అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. హర్మూజ్ జలసంధిలో భద్రతను పశ్చిమాసియాపై ఆధారపడిన దేశాలే చూసుకోవాలని స్పష్టం చేశారు. ఇరాన్ వల్లే చమురు ధరలు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులకు ఆ దేశమే కారణమని ఆరోపించారు. 
 
'ఇరాన్ పిచ్చి ఉగ్రదాడులకు పాల్పడటం వల్లే గ్యాసోలిన్ ధరలు పెరిగాయి. ఇలాంటి ఇరానన్ను అణ్వాయుధాల విషయంలో ఎప్పటికీ నమ్మలేం' అని ట్రంప్ అన్నారు. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా చేసే దేశాలు ఇకపై భద్రతా భారాన్ని మోయాలని ఆయన తేల్చిచెప్పారు. 'ఆ మార్గాన్ని వాళ్లే చూసుకోవాలి. దాన్ని వాళ్లే కాపాడుకోవాలి. చాలా దేశాలు ఈ వివాదంలో జోక్యం చేసుకోకుండా కేవలం లబ్ధి పొందుతున్నాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
ఇతర దేశాలకు ఆయన రెండు మార్గాలను సూచించారు. 'మొదటిది, అమెరికా నుంచి చమురు కొనండి. రెండోది, కాస్త ధైర్యం తెచ్చుకుని ఆ జలసంధికి వెళ్లి దాన్ని మీకోసం మీరే రక్షించుకోండి' అని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారు అని, సౌదీ అరేబియా, రష్యా కంటే కూడా ఎక్కువ ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. పశ్చిమాసియా నుంచి తమకు చమురు అవసరం లేదని, హర్మూజ్ ద్వారా తాము దాదాపుగా దిగుమతులు చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.
 
పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం మధ్య ఉన్న హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైనది. భారత్ వంటి దేశాలు తమ చమురు అవసరాల్లో అధిక భాగాన్ని గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే, అది భారత్‌లో ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటుపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.