గురువారం, 13 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 సెప్టెంబరు 2025 (13:54 IST)

నోబెల్ పురస్కారానికి సిఫార్సు చేయలేదనే భారత్‌పై ట్రంప్ అక్కసు.. అందుకే సుంకాల పోటు

modi - trump
అమెరికా - భారత్ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. దీన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల భారం రూపంలో ప్రారంభించారు. అయితే, భారత్ మాత్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంటూ ఆచితూచి ఆడుగులు వేస్తోంది. రష్యా నుంచి భారత్ భారీ మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటుందని, తద్వారా వచ్చే నిధులతో రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తుందంటూ అమెరికా ఆరోపిస్తుంది. దీంతో భారత్‌పై 50 శాతం సుంకాల భారాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మోపారు. అయితే, అసలు కారణం మాత్రం మరోలావుంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఘర్షణలను నివారించే శాంతిదూతగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ట్రంప్... భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ముగిసిపోయిన ఘనతను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. భారత్ దీనిని అంగీకరించకపోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 
 
మరోవైపు, వాషింగ్టన్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా, భారత్ శత్రుదేశమైన పాకిస్థాన్... ట్రంప్‌కు మద్దతు పలకడమే కాకుండా డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదన చేసింది. దీనికి భారత్ సానుకూలంగా స్పందించలేదు. ఇది డోనాల్డ్ ట్రంప్‌కు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో భారత్‌ను ట్రంప్ ప్రత్యేకంగా లక్ష్యం చేసుకోవడానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
మరోవైపు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా చేస్తున్న వాదనలో ఏమాత్రం నిజం లేకపోగా ద్వంద్వ నీతి కనిపిస్తోంది. గత యేడాది ఐరోపా సమాఖ్య దేశాలు రష్యా నుంచి 21.9 బిలియన్ యూరోల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకున్నాయి. ఇది వారు ఉక్రెయిన్‌కు అందించిన 18.8 బిలియన్ యూరోల సాయం కంటే అధికం కావడం గమనార్హం. పైగా, రష్యా నుంచి చైనా భారత్ కంటే ఎక్కువ మొత్తంలోచమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ డ్రాగన్ కంట్రీపై ట్రంప్ సుంకాల భారం మోపకపోవడం గమనార్హం.