అదిరిపోయే ఫీచర్లతో వందే భారత్ స్లీపర్ రైలు
దేశంలో అమిత వేగంతో ప్రయాణిస్తూ ప్రయాణికులను వందే భారత్ రైళ్ళు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం పగటి పూట మాత్రమే నడుస్తున్న ఈ రైళ్లు మరికొద్ది రోజుల్లో రాత్రిపూట నడువనున్నాయి. ఇందుకోసం వందే భారత్ స్లీపర్ రైళ్ళను అత్యాధునిక సౌకర్యాలతో తయారు చేశారు. ఈ రైలు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకిరానుంది. అత్యాధునిక సౌకర్యాలతో ఈ రైలును తీర్చిదిద్దారు. తొలి వందే భారత్ స్లీపర్ రైలు కోల్‍కతా - గౌహతి మార్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ఈ రైలులోని ప్రత్యేకతలను పరిశీలిస్తే, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుంకుని విశాలమైన ట్రే హోల్డర్, సర్దుబాటు చేసుకునే విండో షేడ్స్, ప్రతి బెర్తుకు రీడింగ్ లైట్లు, హ్యాంగర్లు, మ్యాగజైన్ హోల్డర్లు ఏర్పాటుచేశారు. నీళ్ల బయటకు చిందకుండా ఉండేలా లోతైన వాష్ బేసిన్లు అమర్చారు. దృష్టిలోపం ఉన్న ప్రయాణికుల సౌకర్యార్థం సీటు నంబర్లను బ్రెయిలీ లిపిలో ముద్రించడం విశేషం.
ఈ వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‍లు ఉంటాయి. వీటిలో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. మొత్తం823 బెర్తులు అందుబాటులో ఉంటాయి. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మెరుగైన కుషనింగ్‌తో బెర్తులను ఎర్గోనామిక్ డిజైన్ చేశారు. ప్రయాణం సాఫీగా సాగేలా ఉన్నతమైన సస్పెన్షన్ శబ్దాన్ని తగ్గించే సాంకేతికతను వినియోగించారు. ఆటోమేటిక్ డోర్లు, అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడేందుకు ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్, ప్రమాదాలను నివారించేందుకు కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ వంటి భద్రతా ఫీచర్లను ఈ రైలులో పొందుపరిచారు.
