సినీ నటి జయప్రదను తక్షణం అరెస్టు చేయండి..
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు మరో షాక్ తగిలిగింది. ఆమె ఇప్పటికే ఈఎస్ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే. తాజాగా మరో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ రాంపుర్ జిల్లా ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున రాంపుర్ నుంచి ఎంపీగా జయప్రద పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదైవున్నాయి.
అయితే, ఈ కేసుల విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో సాగుతుంది. ఈ విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. అంతకుముందు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, ఆమెను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్టు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులు హాజరుపరచాలంటూ రాంపూర్ ఎస్పీని ఆదేశిస్తూ, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, సినిమా తర్వాత తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయప్రద.. టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రలోని సమాజ్ వాదీ పార్టీలో చేరి, రాంపుర్ లోక్సభ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు ఆమె రాంపుర్ ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరి, రాంపుర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.