ఫ్రిడ్జ్‌లో పెట్టిన చికెన్ కూర.. వేడి చేసి తినడంతో బాలిక మృతి
తమిళనాడులో ముందు రోజు చేసిన చికెన్ కూరను ఫ్రిడ్జ్‌లో పెట్టి మరుసటి రోజు వేడి చేసి తిన్న బాలిక ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు, అరియలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అరియలూరు జిల్లాలోని జయంగొండం సమీపంలోని గ్రామానికి చెందిన గోవిందరాజులు - అన్బరసి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటన జరిగిన రోజు గోవిందరాజులు తాను నిర్మించనున్న కొత్త ఇంటికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఆ సందర్భంగా కుటుంబ సమేతంగా గుడికి వెళ్లి కోడి కూర తీసుకుని ఇంట్లో వండిపెట్టారు. మిగిలిన చికెన్ పులుసును ఫ్రిడ్జిలో ఉంచి మరుసటి రోజు తిన్నారు. ఆ సమయంలో పాత కూర గ్రేవీ తిన్న ఏడో తరగతి చదువుతున్న చిన్న కూతురు లిథిర అస్వస్థతకు గురైంది.
వెంటనే జయంగొండం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అదేవిధంగా పాత కోడి కూర పులుసు తిన్న తండ్రి గోవిందరాజులు, తల్లి అన్బరసి, సోదరి ద్వారక కూడా అనారోగ్య కారణాలతో జయంగొండం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.