ఆదివారం, 7 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2025 (16:21 IST)

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

photo share
సినీ రాజకీయ ప్రముఖులకు డీప్‌ఫేక్ సమస్య పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రస్తుత కృత్రిమమేధ యుగంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటిగా తయారైంది. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్ నియంత్రణకు సంబంధించిన బిల్లు లోక్‌సభ ముందుకువచ్చింది. ఇలాంటి కంటెంట్‌ కట్టడికి అవసరమైన లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేలా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రతిపాదించారు. 
 
శివసేన ఎంపీ శ్రీకాంత్‌ షిండే ఈ డీప్‌ఫేక్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ఇలాంటి కంటెంట్‌ రూపొందించేందుకు వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలన్నారు. 'వేధింపులు, మోసం, తప్పుడు సమాచారం కోసం డీప్‌ఫేక్‌ను దుర్వినియోగం చేయడం పెరిగిపోయింది. దీని నియంత్రణకు సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలి' అని షిండే అన్నారు. 
 
దురుద్దేశంతో ఇలాంటి కంటెంట్‌ను సృష్టించినా లేదా ఫార్వర్డ్‌ చేసినా అలాంటివారికి శిక్షలు పడాలన్నారు. వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రతగురించి ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ కలవరపెడుతోంది. 
 
ఈ డీప్‌ఫేక్‌ను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు తేలికగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్‌ వీడియోలు సమాజానికి పెనుముప్పుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.