అక్వాన్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష - కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి...
కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుఫానుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. తుఫాను గమనంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అక్వాన్ తుఫాను గంటకు 3.కి.మీ వేగంతో కదులుతోందని.. ఈ సాయంత్రానికి తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.
అయితే, ప్రకృతిలో విపత్తులు సహజమని, వీటిని చూసి భయపడాల్సిన పనిలేదని.. వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వాతావరణ హెచ్చరికలు పంపాలన్నారు. తమను ఆదుకోవడానికి ప్రభుత్వం, అధికారులు ఉన్నారనే భరోసా కల్పించాలన్నారు.
'ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని మూడో తుఫాను తాకుతోంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ సమాచారం పంపాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినా వెంటనే క్లియర్ చేయాలి. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. తుఫానుతో కురిసే భారీ వర్షాలకు చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి' అని అధికారులను బాబు ఆదేశించారు.

