1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Seeks Long-Term Cyclone Solution as Murasu Damage Pegged at Rs. 2,484 Crore

తుఫాన్ల ముప్పుకు శాశ్వత పరిష్కారం చూపాలి : సీఎం చంద్రబాబు

chandrababu
కోస్తాంధ్ర తరచూ తుఫాన్ల ప్రభావానికి గురవుతుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మురసు తుఫాను కారణంగా రాష్ట్రానికి రూ.2,484 కోట్లకుపైగా నష్టం మిగిల్చిందన్నారు. 1.43 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 1.86 లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన కేంద్ర బృందానికి వివరిచారు. 
 
దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసిన కేంద్ర బృందం.. ముఖ్యమంత్రితో వర్చువల్‌గా సమావేశమైంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు.. రెండు బృందాలుగా విడిపోయి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో దాదాపు 60 ప్రాంతాలను సందర్శించారు. దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులు, కాలువలు, ఇళ్లు, విద్యుత్ వ్యవస్థలను పరిశీలించారు. 
 
రైతులు, మత్స్యకారులతో నేరుగా మాట్లాడి నష్టం వివరాలు సేకరించారు. ఎల్‌నినో ప్రభావానికి తోడు ఒకేసారి రెండు తుపాన్లు రావడంతో రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని చంద్రబాబు కేంద్ర బృందానికి వివరించారు. తుఫాను గమనాన్ని ముందుగానే అంచనా వేసి సహాయక చర్యలు చేపట్టామని, 24 గంటల్లోనే రహదారులు, విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్‌ సేవలను పునరుద్ధరించామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభావిత ప్రాంతాల్లో అదనపు రేషన్ కూడా పంపిణీ చేశామని చెప్పారు. 
 
కోస్తాంధ్రకు తుఫాన్ల ముప్పు తరచూ ఉంటున్నందున శాశ్వత పరిష్కారంగా మౌలిక వసతులను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందుకు కేంద్రం ప్రత్యేకంగా సహకరించాలని కోరారు. పది రోజుల్లో నష్టంపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తాము పరిశీలించిన ప్రాంతాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌తో గ్రామీణ రహదారులు, విద్యుత్ స్తంభాలు భారీగా దెబ్బతిన్నాయని కేంద్ర బృందం వెల్లడించింది. 
 
వరి పంటకు తూర్పుగోదావరిలో 80 శాతం, ఏలూరులో 90 శాతం వరకు నష్టం జరిగినట్లు గుర్తించామని తెలిపింది. మామిడి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించింది. పంటల బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో పత్తి రైతుల్లో చాలామంది బీమా చేయించుకోలేకపోయారని తెలిపింది. కచ్చా ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు, గిరిజనులు, ప్రకృతి వ్యవసాయ రైతులకు ప్రత్యేక సాయం అందించాలని సూచించింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
దూసుకొస్తున్న అక్వాన్ తుఫాను... రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక